తెలంగాణ కిచెన్..వడలతో కొత్తకొత్త వెరైటీలు

నోటికి కారం రుచి తగులుతూ, పంటికింద కరకరలాడుతూ ఉండే వేడివేడి వడల్ని ఇష్టపడని వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తినే కొద్దీ తినాలనిపించే వడల్ని కొత్తకొత్త రుచులతో చేసుకుంటే ‘వాహ్వా వడ!’ అనాల్సిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా తయారయ్యే వడ వెరైటీలను ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే వండుకోవచ్చు. మరి ఆయా ప్రాంతాలకు చెందిన కొన్ని వడల వెరైటీలు ఇవి. ఒకసారి ట్రై చేయండి.

మద్దూర్ వడె 

కావాల్సినవి :

బియ్యప్పిండి : ఒక కప్పు
మైదా : అర కప్పు
బొంబాయి రవ్వ : అర కప్పు
ఉప్పు : సరిపడా
కారం : ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ : ఒకటి
పచ్చిమిర్చి : రెండు
అల్లం : చిన్న ముక్క
కరివేపాకు, కొత్తిమీర : కొంచెం
వేడి నూనె : ఒక టేబుల్ స్పూన్
నీళ్లు : సరిపడా

తయారీ : ఒక పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, మైదా, బొంబాయి రవ్వ వేసి కలపాలి. అందులో కారం, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలపాలి. వేడి నూనె వేసి కలిపాక, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలపాలి. పావుగంట సేపు పక్కనపెట్టాలి. ఆ తర్వాత చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను నూనె పూసిన కవర్​ మీద పెట్టి  పల్చటి వడలా చేత్తో వత్తి వేడి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేగిస్తే కర్నాటక ఫేమస్ శ్నాక్​ తినడమే తరువాయి.

ఉల్లివడ

కావాల్సినవి :

ఉల్లిగడ్డలు : నాలుగు
అల్లం : చిన్న ముక్క
కారం : ఒక టేబుల్ స్పూన్
 పచ్చిమిర్చి : మూడు
మెంతులు : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
మైదా : ఒక కప్పు
 కరివేపాకు : కొంచెం
 నూనె : ఒక కప్పు

తయారీ : ఉల్లిగడ్డలు సన్నగా, పొడవుగా తరగాలి. ఉల్లిపాయ తరుగులో ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా మైదా పిండి వేస్తూ కలపాలి.  ఆ తర్వాత అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, కారం వేసి అన్నీ పిండిలో బాగా కలిసిపోయేలా కలపాలి. ఉల్లి మిశ్రమాన్ని వడలా చేసి వేడి నూనెలో వేయాలి. వడలు బంగారు రంగు వచ్చేవరకు వేగిస్తే కేరళ స్టయిల్ ఉల్లి వడలు రెడీ.

దాల్ వడ 

కావాల్సినవి :

పెసరపప్పు : ఒక కప్పు
అల్లం తురుము : అర టీస్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ : రెండు టీస్పూన్లు
ఉప్పు : సరిపడా
కొత్తిమీర : అర కప్పు
నూనె : వేగించడానికి సరిపడా
పసుపు : ఒక టీస్పూన్
మిరియాల పొడి : పావు టీస్పూన్
ఉల్లికాడల తరుగు : పావు కప్పు
వేడి నూనె : ఒక టేబుల్ స్పూన్

తయారీ : పెసరపప్పు కడిగి, మిక్సీ జార్​లో వేయాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్​ చేయాలి. అందులో పసుపు, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం తురుము, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. కొంచెం వేడి నూనె కూడా వేసి ఒకసారి కలపాలి. కడాయి​లో నూనె వేడి చేసి.. పిండి మిశ్రమాన్ని పెద్ద సైజు బోండాల్లా వేయాలి. వాటిని బంగారు రంగు వచ్చేవరకు వేగిస్తే అహ్మదాబాద్​ ఫేమస్​ స్ట్రీట్ ఫుడ్ రెడీ.

అలసంద వడలు

కావాల్సినవి :

అలసందలు : ఒక కప్పు
పచ్చిమిర్చి : రెండు
 అల్లం : చిన్న ముక్క
ఉల్లిగడ్డ : ఒకటి
కరివేపాకు, కొత్తిమీర : కొంచెం
కారం : అర టీస్పూన్
జీలకర్ర : అర టీస్పూన్
ధనియాల పొడి : ఒక టీస్పూన్
కసూరీ మేతీ : అర టీస్పూన్
 ఉప్పు : సరిపడా

తయారీ : అలసందల్ని ఆరుగంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత అలసందల్ని శుభ్రంగా కడిగి వడకట్టాలి. మిక్సీజార్​లో పచ్చిమిర్చి, అల్లం తరుగు, అలసందలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, కొత్తిమీర,  కారం, జీలకర్ర, ధనియాల పొడి, కసూరీ మేతీ, ఉప్పు వేసి కలపాలి. ఈ పిండి మిశ్రమాన్ని వడల్లా చేసి వేడి నూనెలో వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగిస్తే రాయలసీమ ఫేమస్ వడలు తినేయొచ్చు. 

తిరుమల వడ

కావాల్సినవి :

మినుములు (పొట్టుతీయని) : అర కిలో
మిరియాలు : రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా

తయారీ : ఒక గిన్నెలో మినుములు వేసి నీళ్లు పోసి పన్నెండు గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీజార్​లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మిక్సీజార్​లో లేదా రోట్లో మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బి, పొడి చేయాలి. ఆ పొడిని మినప్పిండిలో వేసి కలపాలి. ఆ పిండిని ఉండలు చేయాలి.  ఒక్కో ఉండను తడిపిన క్లాత్​ మీద పెట్టి చేతిని తడి చేసుకుని పల్చగా అదమాలి. నూనె వేడి చేసి ఈ వడలను వేగించాలి. పది నిమిషాలు వేగితే చాలు తిరుమల స్టయిల్​ వడ రెడీ.