తెలంగాణలో డ్రగ్స్, గంజాయి బాధితులు 50 వేల మంది

  • ఇందులో 15 ఏండ్ల నుంచి 28 ఏండ్ల వాళ్లే 85 శాతం
  • పది నెలల్లో నమోదైన కేసుల్లోని లెక్కలు ఇవి
  • స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోనూ ముఠాల హల్​చల్​
  • ఆన్​లైన్​లోనూ డెలివరీ.. పట్నం నుంచి పల్లె దాకా దందా
  • సప్లయర్లుగా మారుతున్న కొందరు బానిసలు  
  • పది నెలల్లో 1,703 కేసులు..  4,145 మంది పెడ్లర్ల అరెస్ట్
  • రూ.105 కోట్ల విలువ చేసే డ్రగ్స్, గంజాయి సీజ్‌‌‌‌‌‌‌‌
  • కట్టడికి టీజీ న్యాబ్‌‌‌‌‌‌‌‌ యాక్షన్​ ప్లాన్​.. ఎక్కడికక్కడ నిఘా
  • -16,477 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు
  • 2 లక్షల మందితో ప్రచారం.. బాధితులకు ట్రీట్​మెంట్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్​తోపాటు పల్లెల్లోనూ జనం.. మరీ ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారు. పదినెలల్లోనే 50 వేల మంది డ్రగ్స్​, గంజాయి బాధితులను పోలీసులు గుర్తించారు. ఇంకా గుర్తించని వారి సంఖ్య రెండింతలు ఉండొచ్చని అంటున్నారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ బానిసలైనవాళ్లలో కొందరు సప్లయర్స్‌‌‌‌‌‌‌‌గా కూడా అవతారమెత్తుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ నిఘా పెరగడంతో బెంగళూరు‌‌‌‌‌‌‌‌, గోవా లాంటి టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ను తమ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారు.

పేరెంట్స్​కు  తెలియకుండా వీకెండ్స్‌‌‌‌‌‌‌‌లో కొకైన్‌‌‌‌‌‌‌‌, ఎమ్‌‌‌‌‌‌‌‌డీఎమ్‌‌‌‌‌‌‌‌ఏ, చరస్‌‌‌‌‌‌‌‌, హెరాయిన్​తో యువత దావతులు చేసుకుంటున్నారు.కొనుగోలుచేసేందుకు డబ్బుల కోసం ఇంటోళ్లను సతాయించడం, అదీ కుదరకపోతే చోరీలకు పాల్పడటం, లోన్​ యాప్స్​ను ఆశ్రయించడం వంటి చర్యలకు దిగుతున్నారు. కొందరు డ్రగ్స్  దొరకక ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలూ ఉన్నాయి. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్​రెడ్డి.. ఈ డ్రగ్స్​, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న మాదకద్రవ్యాలను

అరికట్టకపోతే పంజాబ్​లోని పరిస్థితే మన రాష్ట్రాన్ని వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్​ ఫ్రీ స్టేట్​గా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యూరో(టీజీ న్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసింది. డ్రగ్స్​, గంజాయిని కట్టడి చేసేందుకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నది. ఎక్కడికక్కడ నిఘాను పెంచింది. వాటి బారినపడుతున్నవాళ్లను గుర్తించి కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తున్నది. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. 

స్కూళ్లు, కాలేజీలను కూడా అడ్డగా చేసుకొని..!

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21 వరకు టీజీ న్యాబ్​ అధికారులు మొత్తం1,703 నార్కోటిక్​ డ్రగ్స్​ అండ్​ సైకోట్రోఫిక్​ సబ్​స్టాన్స్​ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు చేశారు. 4,145 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రూ. 105 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్​, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పది నెలల కేసుల్లో దాదాపు 50 వేల మంది బాధితులని తేలింది. ఒక్క సెప్టెంబర్​లోనే 7 వేల మందిని   బాధితులుగా అధికారులు గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది 15 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్యవయస్కులే  85 శాతం మంది ఉన్నారు.

స్కూళ్లు, కాలేజీ ఏరియాల్లోనూ గంజాయి, డ్రగ్స్​ ముఠాలు తిరుగుతూ స్టూడెంట్లను వాటికి అలవాటు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. పబ్స్​, హై ప్రొఫైల్​ పార్టీల్లోనూ డ్రగ్స్​ వాడకం విచ్చలవిడిగా ఉందని, వీటిని కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐటీ ఉద్యోగులు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంజాయికి బానిసలవుతుండగా.. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, అడ్డాకూలీలు గంజాయి, హాష్ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంజాయి చాక్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్లమందుకు బానిసలవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముందుగా లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడిన యువత ఆ తర్వాత క్రమేణా గంజాయి.. ఆపై డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బారినపడుతున్నారు. 

ట్రీట్​మెంట్​ టైమ్​లోనూ అదే యావ

పట్టుబడ్డ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితులకు హైదరాబాద్​లోని 12 సెంటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మూడు నెలల పాటు రీహాబిలిటేషన్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ను అధికారులు అందిస్తున్నారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభమైన మొదటి నెలలో డాక్టర్లను డగ్స్ బానిసలు ముప్పుతిప్పలు పెడ్తున్నారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని డాక్టర్లపై చిందులేస్తున్నారు. వాటి నుంచి వారిని మాన్పించేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

కోడ్​ భాషలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో డెలివరీ

యువతకు పెడ్లర్ల చైన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్​ సప్లయ్ చేస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోడ్ భాషలో ఆర్డర్లు తీసుకుని సరుకును పంపుతున్నారు. నైజీరియన్ ముఠాలు గోవా నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హెరాయిన్, కొకైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ, ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ వంటి డ్రగ్స్​ను హైదరాబాద్​కు సరఫరా చేస్తున్నాయి. ఈజీమనీ కోసం అలవాటు పడిన యువతను, చిల్లర దొంగలను డ్రగ్స్ ముఠాలు తమ ఏజెంట్లుగా మార్చుకుంటున్నాయి. వారి ద్వారా సరఫరా చేయిస్తున్నాయి. కొందరు డ్రగ్స్​ బానిసలు కూడా సప్లయర్స్​గా అవతారమెత్తుతున్నారు. 

సెంటర్​ సిబ్బందిపై దాడి చేసి..!

‘‘హైదరాబాద్​లోని పాతబస్తీకి చెందిన 17 ఏండ్ల అబ్బాయి గంజాయికి బానిసయ్యాడు. బస్తీలో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి తరచూ గంజాయి సేవించేవాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడికి దిగేవాడు. దీంతో  డీ అడిక్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించారు. అక్కడి సిబ్బందిపై కూడా దాడి చేసి పారిపోయి ఇంటికి వచ్చాడు.’’

డ్రగ్స్​ కోసం డాక్టర్లకు సతాయింపు

‘‘హైదరాబాద్​లోని మాదాపూర్​ ఏరియాకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు ఇంజినీరింగ్​ చదువుతున్నాడు. వీకెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు చేసుకునేవాడు. ఇంట్లో కూడా డ్రగ్స్ తీసుకుంటూ తల్లిదండ్రులకు చిక్కాడు. సిటీలోని ఓ ప్రముఖ డీ అడిక్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సహకరించకుండా అక్కడున్న డాక్టర్లు, కౌన్సిలర్లను కూడా డ్రగ్స్ కోసం ఆ యువకుడు సతాయించేవాడు. దీంతో ప్రస్తుతం ఇంట్లోనే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నారు.’’

కౌన్సెలింగ్​, ట్రీట్​మెంట్​ తప్పనిసరి

‘‘డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అలవాటు పడ్డవాళ్లు తమను తాము ఓ అద్భుతంగా ఊహించుకుంటారు. పేరెంట్స్ పర్యవేక్షణ లేక చాలా మంది యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  బానిసలవుతున్నారు. అవి తీసుకోకపోతే జీవితం లేదనే స్టేజీకి చేరుతున్నారు. ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రత ఉండదు. చికాకు, కోపం అధికం అవుతాయి. ఆకలి వేయదు, ఒళ్లంతా వణుకు, గుండెదడ పెరుగుతుంది. బరువు తగ్గిపోతారు.  డ్రగ్స్​ బాధితులకు కౌన్సెలింగ్​, ట్రీట్​మెంట్​ తప్పనిసరి.’’

- డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హరిణీ, సైకియాట్రిస్ట్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 

సివిల్స్​ కోచింగ్​కు వచ్చి..!

వరంగల్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ కావాలన్న కలతో హైదరాబాద్​లోని కోచింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. ఇదే క్రమంలో  ఫ్రెండ్స్​ ద్వారా గంజాయికి అలవాటుపడ్డాడు. ఇటీవల గంజాయి కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి.. డీ అడిక్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయించారు.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21 వరకు పట్టుబడిన డ్రగ్స్​, గంజాయి

గంజాయి                                   20,255 కిలోలు
గంజాయి చాక్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                  30.953 కిలోలు
హాష్​ ఆయిల్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                          24.402 కిలోలు
గసగసాలు(పాపిస్ట్ర)              47.95 కిలోలు
నల్లమందు(ఓపియం)           3.659 కిలోలు
హెరాయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                               2092.05 గ్రాములు
ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ                           913.86 గ్రాములు
కొకైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                                          325.5 గ్రాములు
చరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌                                         244 గ్రాములు
అల్ప్రోజోలం                           486 కిలోలు 
అంఫేటమిన్                           8.5 కిలోలు