నంబర్లు కేటాయిస్తలే.. పన్ను వసూల్ చేస్తలే!

  • ఏటా రూ.50 లక్షలకు పైగా ఆదాయానికి గండి

జగిత్యాల, వెలుగు: ఆఫీసర్ల నిర్లక్ష్యంతో బల్దియాల ఆదాయానికి ఏటా రూ.లక్షల్లో గండి పడుతోంది. ఇంటి నిర్మాణాలు పూర్తి కాగానే ఆఫీసర్లు కొలతల ఆధారంగా టాక్స్ నిర్ణయించి వసూల్ చేయాల్సి ఉంటోంది. ఏళ్లుగా కొన్ని ఇండ్లను ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. మరి కొన్నింటికి మాన్యువల్ ఇంటి నంబర్లు మంజూరు చేసినా ఆన్ లైన్ లోకి ఎక్కించలేదు. అలాగే మున్సిపాలిటీల్లో వీలినమైన పలు గ్రామాల్లోని ఇండ్లను రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో దాదాపు రూ.50 లక్షలకు పైగా పన్ను రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. జగిత్యాలతో పాటు మెట్​పల్లి, కోరుట్ల, రాయికల్ బల్దియాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

రికార్డుల్లో లేని ఇండ్లు ఎన్నంటే..?

జగిత్యాలలో సుమారు 26 వేలకు పైగా డొమెస్టిక్, కమర్షియల్ ఇంటి నంబర్లు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇంకా దాదాపు 2 వేలకు పైగా ఇండ్లకు నంబర్లు కేటాయించలేదు. ఇందులో కొన్ని రికార్డుల్లో మిస్ కాగా, మరికొన్ని ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ఎక్కలేదు. మెట్ పల్లి మున్సిపాలిటీలో 400, కోరుట్లలో 1200, రాయికల్ దాదాపు 200 ఇండ్లకు ఇంటి నంబర్లు లేవు. ఇప్పటికైనా బల్దియాల్లోని ప్రతివార్డులో సర్వే నిర్వహించి ఇండ్లను రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.