బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేత

  •  5వ టౌన్​ ఎదుట బైఠాయించిన బాధితులు  
  •  బోగస్​ పట్టాలు, తప్పుడు రిజిస్ట్ర్రేషన్​తో  అంటగట్టిన నలుగురు కార్పొరేటర్లు
  •  నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు దిగిన ఆఫీసర్లు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ నగర శివారులోని నాగారం భారతీనగర్​ కాలనీ బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేతలతో 44 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.   ఆర్డీవో రాజేంద్రకుమార్​, కార్పొరేషన్​ ఆఫీసర్లు వందలాది పోలీస్​ బందోబస్తుతో వచ్చి రెండు పొక్లెయినర్లతో కట్టడాలను నేలమట్టం చేశారు. శిఖం పక్కనే ఉన్న సర్వే నంబర్ 2142 ల్యాండ్​ను ఆధారం చేసుకొని 13 ఏండ్ల నుంచి పొలిటికల్​ పార్టీల నేతలు ప్లాట్ల దందా సాగించారు. ప్రస్తుత పాలకవర్గంలోని నలుగురు కార్పొరేటర్ల అండతో వారికి రూ.లక్షల ఆదాయం సమకూరింది.

స్లమ్​ ఏరియాలో జీపీఏతో మోసం

నాగారం ఏరియా అంతా దాదాపు గుట్టలతో నిండి ఉంటుంది. 9, 10, 11 డివిజన్లలో విస్తరించిన కాలనీలో గత ప్రభుత్వాలు వేలాది మందికి ఇంటి స్థలాలు ఇవ్వగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో అక్కడక్కడ ఉన్న పట్టాల్యాండ్స్​ను ఓనర్లు  ప్లాట్ల కింద విక్రయించారు. ఈ రకంగా బొందం గడ్డ చెరువును ఆనుకొని ఎకరం విస్తీర్ణంలో ఉన్న పట్టా ల్యాండ్​ మాటున శిఖంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కమార్కులు చిన్నచిన్న బిజినెస్​లు చేసుకునే వారికి 100 , 120, 180 గజాల ఇండ్ల ప్లాట్​లుగా విక్రయించారు. రూ.1.50 లక్షల నుంచి రూ.5.0 లక్షల దాకా డబ్బులు తీసుకున్నారు. 

సుంకటి మదుసూదన్​ జనరల్​ పవర్​ ఆఫ్​ అటార్నీ హోదాలో శేక్​ అమ్జద్​ అనే వ్యక్తి కొనుగోలుదార్లకు రిజిస్ట్రేషన్​ కూడా చేసి ఇచ్చారు. రిజిస్రేషన్​ కానీ కొన్ని స్థలాలకు గవర్నమెంట్​ పట్టాలు సృష్టించి మరీ విక్రయించారు. ఈ తతంగమంతా నలుగురు లీడర్ల కనుసన్నల్లో నడిచింది. సదరు స్థలాలలో పక్కా బిల్డింగ్​లు నిర్మించుకున్న కుటుంబాలు కరెంట్​ కనెక్షన్​లు పొంది క్రమంగా బిల్స్​ చెల్లిస్తున్నారు. 12 ఏండ్ల నుంచి మున్సిపల్​ కార్పొరేషన్​కు హౌస్​ ట్యాక్స్​లు కడుతున్నారు. 

తప్పు ఎవరిది..?

పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు, టీస్టాల్స్​ నిర్వహించే వ్యక్తులు ఒకరిని చూసి మరొకరు ఈ ప్లాట్స్​ కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇళ్లు నిర్మించుకుంటే అసెస్​మెంట్​ నంబర్ ఎలాట్​ చేయడంతో పాటు ట్యాక్స్​లు వసూలు చేస్తుండడంతో కొనుగోలు చేస్తున్న ప్లాట్లు నిజమైనవేనని నమ్మారు. కాలనీలో కరెంటు పోల్స్​ వేయడం ఇండ్లకు కనెక్షన్​లు కూడా ఇవ్వడంతో భరోసా ఏర్పడింది. 

మొదటి నుంచి వాటిని అనుమతించకుంటే ప్లాట్లను ఎవరూ కొనేవారుకాదు. అయితే సదరు ఇండ్లు చెరువు శిఖంలో ఉన్నాయంటూ శనివారం పొద్దున ఆర్డీవో రాజేంద్రకుమార్​, మున్సిపల్​ కార్పొరేషన్​ టీంతో కాలనీలోకి ప్రవేశించి పోలీస్​ బందోబస్త్​ మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం కూడా వీటిని కొనసాగించారు. అనూహ్య పరిణామానికి బిత్తరపోయిన బాధిత కుటుంబాలు ఆదివారం బయటకు వచ్చి డిప్యూటీ మేయర్​ ఇద్రిస్​ఖాన్​ నేతృత్వంలో 5వ టౌన్​ ఎదుట భైఠాయించారు. నీడ కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలకు సమీపవాసులు భోజన వసతి కల్పిస్తున్నారు.  

కలలో కూడా అనుకోలేదు

2011లో వంద గజాల స్థలాన్ని కొనుగోలు చేసి 2013లో పక్కా ఇళ్లు కట్టుకొని కుటుంబమంతా ఆశ్రయం పొందుతున్నం. పట్టా భూమిలో  వెంచర్​ వేశామనడంతో నమ్మినం. ప్లాట్​ రిజిస్ట్రేషన్​ కూడా పూర్తయింది.  ఇంటి ట్యాక్స్​, కరెంట్​ బిల్లు కడుతున్నం.  కాగా సడెన్ గా పోలీసులతో వచ్చి ఇళ్లు కూల్చేశారు.  ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయక కూల్చివేతలు చేపట్టారు.3

తాహెరా బేగం