డబుల్ పెన్షన్లకు చెక్ .. రెండు పింఛన్లు పొందుతున్న 410 మంది గుర్తింపు

  • బోగస్​ పెన్షన్ దారుల ఏరివేత 
  • సర్కార్​ ఖజానాకు ఆరేండ్లలో రూ.2.68 కోట్ల  నష్టం

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో డబుల్ పెన్షన్లు తీసుకుంటున్న వారి పేర్లను ఆసరా జాబితాల్లోంచి అధికారులు తొలగించారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత పింఛన్  పొందుతూ.. మరో పక్క ఆసరా పెన్షన్ తీసుకుంటున్న 410 మంది పెన్షన్లను కట్ చేశారు.   గవర్నమెంట్ బోగస్ పెన్షన్ల ఏరివేతకు ఆదేశాలు జారీ చేయగా..  జిల్లాలో 410 మంది డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది.  వీరు గడిచిన ఆరేండ్ల లో  ఆసరా పెన్షన్ల రూపంలో 2.68 కోట్లు అందుకున్నట్లు వెల్లడైంది. దీంతో  వారికి ఆగస్టు నెల నుంచి ఆసరా పెన్షన్లను నిలిపివేశారు. వీరందరికి రికవరీ నోటీసులు జారీ చేసినా.. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో రికవరీ ప్రయత్నాలను నిలిపివేశారు. 

ప్రతి నెలా రూ.58.16 కోట్లు

జిల్లాలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు, చేనేత, గీత, ఒంటరి మహిళా, బీడీ కార్మికులు, ఎయిడ్స్, పైలేరియా, కిడ్నీ డయాలసిస్​ చేయించుకునే వారు కలిపి మొత్తం 2,78,749 మందికి ప్రతి నెలా రూ.58.16 కోట్ల పెన్షన్ ను ప్రభుత్వం అందజేస్తోంది.  

ఇలా బయటపడింది

 రిటైర్​ఎంప్లాయిస్​కు ఐడీ నంబర్​తో ట్రెజరీ శాఖ పింఛన్​ చెల్లిస్తుంది.  వాటితో పాటు పేదల పింఛన్​ పొందుతున్న వారి పేర్లు, ఆధార్​తో డాటా వెరిఫికేషన్​ చేయించగా 410 మంది ఇప్పటిదాకా రూ.2.68 కోట్లు ఆసరా పెన్షన్ అందుకున్నట్లు తేలింది. నెలకు రూ. 35 వేల రిటైర్డ్ పింఛన్ పొందుతూ కూడా రూ. 2016 వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. ఇంకా అత్యాశకు పోయి సదరం క్యాంపులో వికలాంగుల సర్టిఫికెట్ సంపాదించి రూ. 3016 పింఛను తీసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం.  ఇలాంటి వారికి ఆగస్టు నుంచి పెన్షన్ కట్ చేయగా.. ఫేక్ సదరం సర్టిఫికెట్  పొందిన ఉదంతంపై ఆఫీసర్లు విచారణ
 చేస్తున్నారు.