కిచెన్ తెలంగాణ : రొటీన్​కి భిన్నంగా గోబీ వెరైటీలు​

కాలిఫ్లవర్​తో ఇప్పటికే బోలెడన్ని వెరైటీలు టేస్ట్​ చేసి ఉంటారు. అయినా సరే హెల్దీగా ఉండాలంటే  తింటూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్​ ఎక్కువ. అది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. అలాగని రొటీన్​ టేస్ట్ తినాలంటే బోర్​ అనిపించొచ్చు. అందుకే ఈ రెసిపీలపై ఓ లుక్కేయండి. ఈజీగా, ఫాస్ట్​గా ఇలా శ్నాక్స్​ రూపంలో చేసుకుని తినేయండి.

ఫింగర్స్

కావాల్సినవి : కాలిఫ్లవర్ – ఒకటి (చిన్నది) సేమ్యా, సగ్గుబియ్యం – ఒక్కోటి అర కప్పు ఆలుగడ్డలు (ఉడికించినవి) – రెండు పల్లీల పొడి – అర కప్పు
పచ్చిమిర్చి – నాలుగు బియ్యప్పిండి – రెండు టీస్పూన్లు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : మిక్సీజార్​లో సేమ్యా, సగ్గుబియ్యం వేసి పౌడర్​లా చేయాలి. కాలిఫ్లవర్​ని తురిమి అందులో ఆలుగడ్డలు వేసి మెదపాలి. అందులో సేమ్యా, సగ్గుబియ్యం పౌడర్ వేయాలి. ఉప్పు, పల్లీల పొడి, పచ్చిమిర్చి తరుగు వేసి బాగాకలపాలి. 

మూతపెట్టి పదినిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఆ మిశ్రమంలో బియ్యప్పిండి వేసి, నీళ్లు పోసి కలపాలి. ఆపై ఫింగర్స్​ ఆకారంలో తయారుచేయాలి. తర్వాత పాన్​లో నూనె వేడిచేసి అందులో వేసివేగించాలి. వీటిని కెచెప్​లో​ అద్దుకుని తింటే బాగుంటాయి.

గోబీ వింగ్స్

కావాల్సినవి : కాలిఫ్లవర్ – ఒకటి, ఉప్పు, నీళ్లు – సరిపడా బియ్యప్పిండి, మైదా కార్న్ ఫ్లోర్​ – ఒక్కోటి అర కప్పు మిరియాల పొడి, ఒరెగానో – ఒక్కోటి ఒక్కో టీస్పూన్
కారం – రెండున్నర టీస్పూన్లు బ్రెడ్ పొడి – రెండు కప్పులు

తయారీ :  ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు వేసి కాగబెట్టాలి. నీళ్లు తెర్లిన తర్వాత అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత నీటిని వడకట్టి, ముక్కల్ని వేరే గిన్నెలో వేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, కార్న్​ ఫ్లోర్, మైదా, ఉప్పు, అర టీస్పూన్ మిరియాల పొడి, ఒరెగానో, ముప్పావు టీస్పూన్ కారం వేసి బాగా కలపాలి. అందులో నీళ్లు పోసి బజ్జీల పిండిలాగ కలపాలి. 

మరో గిన్నెలో బ్రెడ్ పొడి, అదే క్వాంటిటీలో మరోసారి కారం, మిరియాల పొడి, ఒరెగానో, ఉప్పు వేసి కలపాలి. ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కల్ని తయారుచేసుకున్న పిండిలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఆపై వాటిని చల్లటి నీళ్లలో ఒకసారి తడిపి, మరోసారి బ్రెడ్​ పొడిలో దొర్లించాలి. పాన్​లో నూనె వేడి చేసి రెడీ చేసిన కాలిఫ్లవర్​ ముక్కల్ని వేసి బాగా వేగించాలి. క్రిస్పీ, స్పైసీగా ఉండే గోబీ వింగ్స్ రెడీ.

కాలిఫ్లవర్ - ఓట్స్ టిక్కీ

కావాల్సినవి :కాలిఫ్లవర్ తరుగు – రెండు కప్పులు ఓట్స్,  ఓట్స్ పిండి, ఉల్లిగడ్డ, బీన్స్ క్యారెట్స్ తరుగు – ఒక్కోటి అర కప్పు  నూనె – మూడున్నర టీస్పూన్లు పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీస్పూన్,  కొత్తిమీర పుదీనా – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు  గరం మసాలా,ఆమ్​చూర్ పొడి – ఒక్కోటి ఒకటిన్నర టీస్పూన్, 
అల్లం పేస్ట్, చాట్ మసాలా – ఒక్కోటి అర టీస్పూన్, ఉప్పు – సరిపడా

తయారీ : పాన్​లో నీళ్లు పోసి కాగబెట్టాలి. ఆ వేడి నీళ్లలో కాలిఫ్లవర్, బీన్స్, క్యారెట్ తరుగు వేసి ఉడికించాలి. తర్వాత నీటిని వడకట్టాలి. ఓట్స్​ పిండి కోసం ఓట్స్​ని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​ వేడి చేసి నూనె వేసి అందులో ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీయాలి. అందులో క్యారెట్, బీన్స్, కాలిఫ్లవర్ తరుగు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి. 

ఆ తర్వాత ఓట్స్, ఓట్స్ పిండి, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఆమ్​చూర్ పొడి, అల్లం పేస్ట్, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి పదినిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, అరచేతిలో పెట్టుకుని అదిమి టిక్కీ ఆకారంలో చేయాలి. పాన్​ వేడి చేసి నూనె వేసి.. టిక్కీలను పెట్టి పైన నూనె పూసి రెండు వైపులా కాల్చాలి.