పాక్‌‌‌‌లో తెగల మధ్య ఘర్షణలు.. 37 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్లో రెండు తెగల మధ్య ఘర్షణ తలెత్తి 37 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వాయువ్య పాకిస్తాన్‌‌‌‌లోని ఖైబర్ పఖ్తున్‌‌‌‌ఖ్వా ప్రావిన్స్‌‌‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పరాచినార్ సమీపంలో గురువారం ప్రయాణికులతో వెళ్తున్న వాహనాల కాన్వాయ్‌‌‌‌పై దాడి జరిగి 47 మంది మరణించారు. 

దీంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో అలీజాయ్, బగన్ అనే గిరిజన తెగల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో గత 24 గంటల్లో  37 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని శనివారం పోలీసులు తెలిపారు. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు హెలికాప్టర్‌‌‌‌లో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. భారీ ఆటోమేటిక్ ఆయుధాలతో గిరిజనులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

బలిష్‌‌‌‌ఖేల్, ఖార్ కాలీ, కుంజ్ అలీజాయ్, మక్బల్‌‌‌‌లలో కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఘర్షణల్లో ఇండ్లు, దుకాణాలు దెబ్బతినడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాగే, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను శనివారం మూసివేశారు. ఆరుగురు మహిళలను బందీలుగా తీసుకున్నట్టు తెలిసింది. కాగా, సెప్టెంబర్​లో కుర్రం జిల్లాలో ఒక భూభాగం విషయంలో షియా, సున్నీ తెగల మధ్య ఎనిమిది రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించారు. 120 మంది గాయపడ్డారు.