కార్తీకమాసంలో ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో నిండిపోతుంది. పూజలు, వ్రతాలు, దీపారాధనలతో ఆడబిడ్డలంతా బిజీ అవుతారు. కార్తీక మాసంలో శుక్లపక్ష పున్నమి తిథిలో పదిహేనవ రోజు వచ్చే కార్తీక పౌర్ణమి మరింత ప్రత్యేకం. దీన్నే ‘కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి జీడికంటి పున్నమి అని కూడా పిలుస్తారు.
ఈ రోజున పొద్దు పొడవకముందే ఆడవాళ్ళంతా తలస్నానం చేస్తారు. ఇంటిముందు ముగ్గులు పెట్టి, తులసి కోట లేదా కాలువ, చెరువుల దగ్గర 365 వత్తుల్ని ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తారు. అలాగే బియ్యప్పిండి, ఉసిరి కాయలతో చేసిన దీపాలు కూడా వెలిగిస్తారు.
తర్వాత శివుడి గుడికెళ్లి గుమ్మడి ఆకు, వక్క, పండ్లని బ్రాహ్మణులకు దానమిస్తారు. ముత్తైదువులకి వాయినాలు ఇస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అరటి దొన్నెలో దీపాలను వెలిగించి పసుపు, కుంకుమ చల్లి నదులు, కాలువల్లో వదులుతారు. ఇలా చేయడం వల్ల అష్టశ్వర్యాలు తమ వెంటే వస్తాయని, కుటుంబం చల్లగా ఉంటుందని నమ్ముతారు.
ఉసిరికాయ స్నానం..
కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు శివుడికి ఇష్టమైన ఉసిరి చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరి చెట్టు నీడలో తలస్నానాలు కూడా చేస్తారు. ఈ ఆచారాన్నే ఉసిరికాయ స్నానం అంటారు. స్నానం చేసేటప్పుడు ‘కార్తీకే హం.. కరిష్యామి వ్రత స్నానం జనార్ధన.. ప్రీత్యర్థం.. దేవేశ దామోదర మయనహ..(ఓ జనార్ధనా. కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించుచున్నాను. నన్ను రక్షించు) అనే మంత్రం చదివితే మంచిది.
దానం చేయాలి..
ఈ రోజంతా నియమ నిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు దీపాన్ని దానం చేస్తే చాలా పుణ్యం. బియ్యప్పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాలతో పాటు స్థోమతని బట్టి వెండి ప్రమిదలను కూడా దానం చేయొచ్చు.
కార్తీకమాసమంతా ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెడతారు. పౌర్ణమి రోజు ఇంట్లో తులసి పూజ చేసి వత్తులు వెలిగించడం యజ్ఞం చేయడంతో సమానం అంటున్నారు పండితులు శివానందచారి.