ప్రభుత్వ ఉద్యోగులకు 3.64%  డీఏ...జీవో ఇచ్చిన ఆర్థిక శాఖ 

  •     డిసెంబర్​లో చెల్లించే నవంబర్ జీతంతో కలిపి అందజేత

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్​లో చెల్లించే నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఈ పెంపుతో ప్రస్తుతం ఉన్న 22.75 శాతం డీఏ.. 3.64 పెరిగి 26.39 శాతానికి చేరింది. పెరిగిన డీఏ 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తించనుంది. 2022 జూలై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31వరకు డీఏ బకాయిల మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.

2025 మార్చి 31వ తేదీలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేసి, మిగిలిన 90 శాతం మొత్తాన్ని 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైమ్​ కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో డీఏ బకాయిలు ఇస్తారు. రిటైర్డ్​ ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపు చేస్తారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. పరిశీలించిన సీఎం.. డీఏ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 26న జరిగిన  భేటీలో కేబినెట్​ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వచ్చాయి. ఒక డీఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఉద్యోగుల జేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్​ డీఏలను కూడా విడతల వారీగా రిలీజ్​ చేయాలని కోరారు.