చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ 36 మంది మావోయిస్టులు మృతి

  • అబూజ్​మఢ్​ దండకారణ్యంలో తుపాకుల మోత
  • డీఆర్​జీ, ఎస్టీఎఫ్​, సీఆర్​పీఎఫ్, బస్తర్​ ఫైటర్స్ కూంబింగ్
  • మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు
  • మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
  • మృతుల్లో అగ్రనేతలు నీతి, కమలేశ్.. వీరిద్దరిపై 8 లక్షల రివార్డు
  • ఆటోమేటిక్ ​వెపన్స్​ దొరకడంతో అగ్రనేతలున్నట్టు అనుమానం
  • అదనపు బలగాల తరలింపు.. కొనసాగుతున్న గాలింపు

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది.అబూజ్​మఢ్​ ఏరియాలో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నారాయణ్​​పూర్–​-దంతెవాడ జిల్లాల బార్డర్​లోని నెందూర్, గోవెల్, తుల్​తులీ  గ్రామాల అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు నీతి, కమలేశ్​ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. 

వీరిద్దరిపై రూ.8లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. దండకారణ్యంలో ఈ ఏడాదిలోనే ఇది అతిపెద్ద ఎన్​కౌంటర్​గా పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఏకే47, ఎస్ఎల్ఆర్, ఆటోమెటిక్​ వెపన్స్ స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ పీ, నారాయణ్​పూర్, దంతెవాడ ఎస్పీలు ప్రభాత్​కుమార్​, గౌరవ్​ రాయ్ వెల్లడించారు. 

ఉనికి కోసం వచ్చి..చావు దెబ్బతిని

చత్తీస్​గఢ్​లో మావోయిస్టులు ఇటీవల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గడిచిన 8 నెలల్లో 185 మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వచ్చి చావు దెబ్బతిన్నారు. అబూజ్​మఢ్​లో ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు అక్కడ కొత్తగా మాన్పూర్, కసర్​మెట్ట, మొహందీ, ఇర్రక్​బట్టి గ్రామాల్లో సీఆర్​పీఎఫ్​ బేస్​ క్యాంపులను ఏర్పాటు చేశారు. సేఫ్​జోన్​ను భద్రతా బలగాలు దాదాపు చుట్టుముట్టాయి. 

మావోయిస్టు అగ్రనేతలు ఉండే ఈ ప్రాంతంలో తాజాగా ఆర్మీ బేస్​ క్యాంపు కోసం కేంద్రం 5 వేల హెక్టార్ల భూమిని సేకరిస్తున్నది. 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా తన చత్తీస్​గఢ్​ పర్యటనలో ప్రకటించారు. లొంగిపోవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇలాంటి తీవ్ర ఒత్తిళ్ల మధ్య భద్రతా బలగాలపై పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఓర్చా, బార్సూర్​ ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా సమావేశం అయినట్టుగా బస్తర్​ పోలీసులకు పక్కా సమాచారం అందింది. 

దీంతో దంతెవాడ, నారాయణ్​పూర్​ జిల్లాల నుంచి డీఆర్జీ, ఎస్టీఎఫ్​,సీఆర్​పీఎఫ్​, కోబ్రా, బస్తర్ ఫైటర్లను రంగంలోకి దించారు. నెందూర్, గోవెల్, తుల్​తులీ గ్రామాల అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మావోయిస్టులు ఆ ప్రాంతంలో అప్పటికే మిలీషియా, పీఎల్​జీఏ సభ్యులతో దాడులకు సిద్ధంగా ఉన్నారు. భద్రతా బలగాలను చూసి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగ్గా..

 36 మంది మావోయిస్టులు మృతిచెందారు. జవాన్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే, ఎన్​కౌంటర్ జరిగిన​ ప్రదేశంలో ఏకే -47, ఎస్ఎల్ఆర్​,ఆటోమెటిక్​  వెపన్స్ దొరకడంతో భారీ వ్యూహంతోనే అగ్రనేతలు దాడికి దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం అడిషనల్​టీంలను కూంబింగ్​కు పంపించారు. కూంబింగ్​ ఇంకా కొనసాగుతూనే ఉందని బస్తర్ ఐజీ సుందర్​రాజ్​ పీ తెలిపారు. 

కిష్టారం ఏరియా కమిటీ డంప్​ స్వాధీనం

చత్తీస్​గఢ్​ రాష్ట్రం సుక్మా జిల్లా చింతగుప్ప పోలీస్​స్టేషన్​ పరిధిలోని బొంతలంక- ఎర్నపల్లి  అడవుల్లో గురువారం రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో కిష్టారం ఏరియా కమిటీ పీఎల్​జీఏ 1 బెటాలియన్​కు చెందిన మావోయిస్టుల డంప్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చింతవాగు ఒడ్డున మావోయిస్టుల సమావేశంపై భద్రతా బలగాలు గురిపెట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. 12 బోర్​ తుపాకులు, వైర్​లెస్​ సెట్లు, సోలార్​ ప్లేట్లు, కెమెరా ఫ్లాష్​లు, డిటోనేటర్లు, మందులు, నిత్యావసర సరుకులు, విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.

తుది దశకు నక్సలిజం : చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయ్​

చత్తీస్ గఢ్​​లో నక్సలిజం తుదిదశకు చేరుకుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్​ అన్నారు.  ‘‘అబూజ్​మఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 36 మంది మావోయిస్టులు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మన భద్రతా బలగాలు సాధించిన గొప్ప విజయం ఇది. వారందరికీ అభినందనలు. 9 నెలల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా ఇక్కడ 2 సార్లు పర్యటించారు. 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం కేంద్ర సంకల్పం అని చెప్పారు. రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం” అని ట్వీట్​ చేశారు.