ట్రావెల్స్‌‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. కోదాడ దగ్గర్లో ఘటన

కోదాడ, వెలుగు: ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో సుమారు 30 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురికి సీరియస్‌‌గా ఉంది. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కట్టుకొమ్మగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. కోదాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహి ట్రావెల్స్‌‌కు చెందిన బస్సు హైదరాబాద్‌‌ నుంచి గోకవరం వెళ్తోంది. ఈ క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే బస్సును రోడ్డు పక్కన ఆపాడు. 

ఈ టైంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ సూపర్‌‌ లగ్జరీ బస్సు ట్రావెల్స్‌‌ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని కోదాడలోని హాస్పిటల్‌‌కు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విజయవాడకు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కోదాడ పోలీసులు తెలిపారు.