తెలంగాణాలో 25 లక్షల కుటుంబాలకు భూముల్లేవ్..70% దళితులే

  • కూలి పనులు చేసుకుంటూ జీవనం
  • ధరణి కమిటీ రిపోర్టులో వెల్లడి
  • భూమి లేని రైతు కూలీలకు ఏటా
  • 12 వేల సాయంపై సర్కార్ కసరత్తు

హైదరాబాద్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ.. సాగు భూముల్లేని కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీలో నలుగురు చొప్పున అనుకున్నా.. దాదాపు కోటి మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధరణి కమిటీ తన రిపోర్ట్ లో ఈ విషయం పేర్కొన్నది. 

దళితులతో పాటు మైనారిటీలు, ఎస్టీలు, బీసీలకు కూడా ఎలాంటి భూముల్లేవని ఈ రిపోర్టు స్పష్టం చేస్తున్నది. సాగు భూములు ఉన్న రైతులకు ఇప్పటికే రూ.2లక్షల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేసిన సర్కార్.. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమవుతున్నది. ఎలాంటి సాగు భూమి లేక కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఏటా రెండు విడతల్లో రూ.12వేల చొప్పున అందించాలని సర్కార్ నిర్ణయించింది.

వచ్చే నెలలోనే మొదటి విడత కింద రూ.6 వేల చొప్పున సాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీని కోసం అవసరమైన వివరాలను ఆయా శాఖల ద్వారా సేకరిస్తున్నది. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో నిరుపేదలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

గుంట భూమి కూడా లేనోళ్లలో దళితులే ఎక్కువ

గుంట భూమి కూడా లేనోళ్లలో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ల జీవన స్థితిగతులు ఇప్పుడిప్పుడే మెరుగుపడ్తున్నాయని, వారికి ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. భూమి లేని 25 లక్షల కుటుంబాల్లో 70 శాతం ఎస్సీ ఫ్యామిలీలే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంచిపెట్టింది. వీరిలో ఎక్కువ శాతం మంది దళితులే ఉన్నట్లు సీఎం రేవంత్​కు అధికారులు నివేదిక ఇచ్చారు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది దళితులు భూములు అమ్మేశారు.

కుల గణన సర్వే వివరాలూ పరిగణనలోకి..

ఉపాధి హామీ కార్డులు, కుల గణన సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగానూ ఒక్కో నిరుపేద కుటుంబానికి ఏటా రూ.12  వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 34.51 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. కుల గణన సర్వే ద్వారా కూడా భూమి లేని వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. అందులో ఉన్న డేటాను కూడా పరిగణనలోకి తీసుకుని నిరుపేద కుటుంబాల జాబితాను ప్రభుత్వం ఫైనల్ చేయనున్నది.

20 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తే.. ఏటా రూ.2,400 కోట్లు అవసరం అవుతాయి. వీలైనన్ని ఎక్కువ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. జాబ్ కార్డుల్లో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. భూమి లేకపోవడంతో పాటు వేరే పని దొరక్కపోవడంతోనే వాళ్లంతా ఉపాధి హామీ పనులకు వెళ్లారనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.