ప్రపంచంలోనే పొడవైన వేణువు.. అయోధ్య రామయ్యకు సమర్పించిన ముస్లిం కుటుంబం

ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతున్నది. అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఎవరికి ఎవరు తమకు తోచిన కానుకలను అయోధ్య నగరానికి పంపుతున్నారు. ఈ క్రమంలోనే 21.6 అడుగుల పొడువున్న వేణువును ఫిలిబిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కానుకగా ఇవ్వనున్నది. ఈ భారీ వేణువును ఫిలిబిత్‌ నుంచి అయోధ్యకు తరలించనున్నారు.

ఈ వేణువును ఫిలిబిత్‌కు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు నవాబ్‌ అహ్మద్‌ భార్య హీనా ఫర్వీన్‌, అతని కొడుకు అర్మాన్‌ నబీ, అతని స్నేహితులతో కలిసి తయారు చేయగా.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన హరీశ్‌ రౌతేలా ఆ వేణువుకు పూజలు చేశారు. ఈ నెల 26న అయోధ్య ధామ్‌కు పంపనున్నారు. 2021లో 16 అడుగుల పొడవైన వేణువును తయారు చేయగా.. ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది.  21.6 అడుగుల వేణువును తయారు చేశాడు. ఇదే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలువనున్నది. అర్మాన్‌ కుటుంబం వేణువులను తయారు చేస్తూ ఉంటుంది. ఈ వేణువును అసోంకు చెందిన వెదురుకర్రతో తయారుచేసినట్లు చెప్పారు

 వెదురు ప్రత్యేకత 

20 సంవత్సరాల కిందట ఈ వెదురుకర్రను సేకరించి పెట్టామని.. అయోధ్య రామయ్యకు కానుకగా ఉపయోగపడుతుందని అనుకోలేదని సదరు కుటుంబం తెలిపింది. వేణువు వ్యాసం 3.5 అంగుళాలు ఉంటుంది. గుండ్రని వెదురు ప్రస్తుతం అందుబాటులో లేదు. వేణువు తయారు చేయడానికి పది రోజులు సమయం పట్టింది.ఈ వేణువు తయారీకి 70 నుండి 80 వేల రూపాయల ఖర్చయిందని చెబుతున్నారు. ప్రత్యేకత ఏమిటంటే దాన్ని రెండు వైపులా ఈ వేణువుతో గానం చేయవచ్చు.  ప్రస్తుతం ఈ వేణువు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా ట్రక్కులో అయోధ్య ధామ్‌కు తరలించనుండగా.. మ్యూజియంలో భద్రపరచనున్నారు.