జైనథ్ మండలంలో చేతికొచ్చిన పత్తి  నేలకొరిగింది

  • అన్నదాత ఆశలు ఆవిరి
  • నీట మునిగిన 2 వేల ఎకరాల పంటలు
  • ఫసల్ బీమా అమలుకు నోచుకోక నష్టపోతున్న రైతులు
  • ఎకరానికి రూ. 40 వేలు పరిహారం ఇవ్వాలని వేడుకోలు

ఆదిలాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలకు అన్నదాత అతలాకుతలమయ్యాడు. పంటలకు ఎరువులు, పురుగుల మందులు కొట్టడంతో పంట ఏపుగా పెరిగి చాలా చోట్ల పూత దశకు చేరుకున్న పత్తి పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలో ఈ ఏడు ఆశించిన స్థాయిలో పంట ఎదుగుతున్న క్రమంలో వర్షాలు, వరదల రూపంలో తీవ్ర నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంటలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం పరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లాలో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలను అధికారులు ప్రాంథమిక అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో జైనథ్, భీంపూర్, తాంసి, తలమడుగు, బేల మండలాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పెన్ గంగా బ్యాక్ వాటర్​తోనే జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో 550 ఎకరాల్లో పంట నీట మునిగింది. 

రూ.30 వేలు పరిహారం చెల్లించాలి..

ప్రతి ఏడాది అధిక వర్షాలు.. వరదలతో ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతోంది. అయినప్పటికీ పరిహారానికి మాత్రం రైతులు నోచుకోవడం లేదు. గతేడాది సైతం అధిక, అకాల వర్షాలతో దాదాపు 30 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు. విత్తన దశ, పంట ఎదిగే దశలో వర్షాలకు దెబ్బతిని రెండేసి మార్లు పంట వేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి రెట్టింపవుతోంది. పత్తి రైతులు ఎకరానికి రూ.30 వేలు ఖర్చు చేశారు. ఇప్పుడు దెబ్బతిన పంటల స్థానంలో మళ్లీ పంటలు వేసే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.30 వేలు చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. సోయ, కంది ఇతర పంటలకు సైతం పంట నష్టాన్ని చూసి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారులు ప్రాథమిక అంచనా వేస్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. 

ఫసల్ బీమాతో మేలు

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో పత్తి సోయ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సారీ భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు ఉండడంతో పంట నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం అమలు కాకపోవడంతో బీమా వర్తించడం లేదు. 2016 నుంచి 2020 వరకు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ తర్వాత నిలిపివేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినప్పుడు రైతులకు పరిహారం అందడం లేదు. ఈక్రమంలో ఫసల్ బీమా అమలు చేయాలని రైతులు 
కోరుతున్నారు.

6 ఎకరాల్లో పత్తి పంట మునిగింది

పెన్ గంగా బ్యాక్ వాటర్​ కారణంగా నేను వేసిన ఆరు ఎకరాల్లో పత్తి పంట మునిగింది. ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టినం. పంట ఎదుగుతున్న సమయంలో వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వమే ఎకరానికి రూ.30 వేలు పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – రామన్న, రైతు, ఖాప్రి గ్రామం, జైనథ్​ మండలం