తీవ్ర విషాదంగా మారిన దక్షిణ కొరియా విమాన ప్రమాదం.. 181 మందిలో ఇద్దరే మిగిలారు

సియోల్: దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రమాద సమయంలో ఫ్లైట్ సిబ్బందితో కలిపి విమానంలో మొత్తం 181 మంది ఉండగా.. ఇందులో 179 మంది మరణించినట్లు దక్షిణ కొరియా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్ధారించినట్లు యోన్‌హాప్ మీడియా నివేదించింది. ఇద్దరు మాత్రమే ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతోన్నట్లు పేర్కొన్నారు. విమాన శకలాల నుండి మృతదేహాలను బయటకు తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, బ్యాంకాక్ నుంచి 181 మంది ప్రయాణికులతో దక్షిణ కొరియో వెళ్తోన్న జెజు ఎయిర్ ఫ్లైట్ 2216  విమానం 2024, డిసెంబర్ 29వ ఉదయం కొరియాలోని ముయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం అదుపు తప్పి ఎయిర్ పోర్టు ఫెన్సింగ్ను ఢీ కొట్టి రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీంతో విమానంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మంటల్లో విమానం పూర్తిగా దగ్ధం కావడంతో లోపల ఉన్న ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది సజీవ దహనమయ్యారు. ఫ్లైట్‎లోని మొత్తం 181 మందిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్లు అధికారులు తెలిపారు. 

ఇద్దరిలో ఒకరు ప్రయాణికుడు కాగా.. మరొకరు విమాన సిబ్బందని వెల్లడించారు. సౌత్ కొరియా లోకల్ టైం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన  విమానాన్ని ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్‎లో సమస్య తలెత్తిందని.. దీంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‎కు ప్రయత్నించగా.. విమానం అదుపు తప్పి ఫెన్సింగ్‎ను ఢీకొట్టి పేలిపోయిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు అసలు కారణమేంటన్నది దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.