పోలేపల్లి జీపీలో రూ.1.73 కోట్ల ఫ్రాడ్​

  • తీర్మానం లేకుండానే చేయని పనులకు బిల్లులు
  • చర్యలకు సిద్ధం అవుతున్న ఉన్నతాధికారులు

మహబూబ్​నగర్​, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో కొందరు సర్పంచులు గ్రామ పంచాయతీల ఫండ్స్​ను పక్కదారి పట్టించారు. గ్రామ సభలలో తీర్మానం లేకుండానే చేయని పనులకు బిల్లలు తీసుకున్నారు.  ఇందుకు పంచాయతీ సెక్రటరీలూ సహకరించారు.  తాజాగా మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని పోలేపల్లి జీపీలో రూ.1.70 కోట్ల ఫ్రాడ్​ జరిగినట్లు తెలిసింది. వీటికి సంబంధించి ఎంబీ రికార్డులు, ఓచర్లు, బిల్లులు లేకపోవడంతో బాధ్యులపై సర్కారు యాక్షన్​ తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.

రికార్డులు అప్పగించకపోవడంతో..

గత జులైలో   సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్​ ట్రాన్స్​ఫర్స్​ నిర్వహించింది. ఇందులో భాగంగా  పంచాయతీ సెక్రటరీలు ఇతర ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. అయితే పోలేపల్లికి చెందిన సెక్రటరీ శివప్రకాశ్​ ఇదే జిల్లాలోని హన్వాడ మండలం అమ్మాపూర్​ తండాకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఈయన స్థానంలో లక్ష్మీనారాయణ జులై 20న పోలేపల్లి సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు.

అప్పటి నుంచి శివప్రకాశ్​ ఈ జీపీకి సంబంధించిన రికార్డులు లక్ష్మీనారాయణకు అప్పగించలేదు.   దీనిపై కొత్త సెక్రటరి పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు స్పందించి ఆగస్టులో శివప్రకాశ్​కు మెమో జారీ చేశారు. మూడు రోజుల్లో రికార్డుల అప్పగిస్తామని చెప్పిన శివప్రకాశ్..  ఎంతకూ వాటిని అప్పగించకపోవడంతో మండల పంచాయతీ ఆఫీసర్.. జిల్లా పంచాయతీ ఆఫీసర్​కు కంప్లైంట్​ చేశారు. దీంతో ఈ విషయం కలెక్టర్​కు దృష్టికి  చేరింది. అయితే రికార్డులకు సంబంధించిన విచారణ చేయాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి డీఎల్​పీఓకు ఆదేశాలొచ్చినట్లు సమాచారం.

రూ. 1.73 కోట్ల నిధులకు ఆధారాల్లేవ్​

గ్రామ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం జీపీ నిధులు, స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్ (ఎస్​ఎఫ్​సీ)​, సెంట్రల్​ ఫైనాన్స్​ కమిషన్ (సీఎఫ్​సీ)​, విలేజ్​ వాటర్​ అండ్​ శానిటేషన్​ కమిటీ (వీడబ్ల్యూఎస్​సీ), ఎన్​ఆర్​ఈజీఎస్​ కింద  ఏటా నిధులు మంజూరవుతాయి. ఈ నిధులను గ్రామ పంచాయతీ ఆమోదం ద్వారా వినియోగించాల్సి ఉంటుంది. కానీ 2019-–20 నుంచి 2023-–24 ఫినాన్షియల్​ ఇయర్​ వరకు ఈ ఫండ్స్​ కింద పోలేపల్లి జీపీలో రూ.7.03 కోట్ల వరకు ఖర్చు చేయగా..  ఇందులో 1.73 కోట్లకు సంబంధించి గ్రామ సభ ఆమోదం లేకుండా నిధులు డ్రా చేసినట్టు ఆఫీసర్ల ఎంక్వైరీలో బయటపడింది.

 2019–-20 నుంచి 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌023–-24 వరకు హరితహారం మొక్కలు కొనుగోలు చేసినట్లు ఫేక్​ బిల్లులు పెట్టి రూ.30 లక్షలు డ్రా చేసుకున్నట్లు  సమాచారం.    'పల్లె ప్రగతి'లో భాగంగా పారిశుధ్య పనులు, పిచ్చి మొక్కల తొలగింపు, పాత ఇండ్ల కూల్చివేతల కోసం జేసీబీకి రూ.25 లక్షలు, సీసీ రోడ్లకు రూ.16.70 లక్షలు, యానిమల్​ క్యాచింగ్​ ఖర్చుల కింద రూ.3.17 లక్షలు, సివిల్ వర్కులు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఇతర పనులు చేసినట్లు రూ.33.77 లక్షలు, ఎలాంటి బిల్లుల లేకుండా వివిధ పద్దుల కింద  రూ.16.13 లక్షలు,  వీడబ్ల్యూఎస్​సీ అడ్వాన్సులు రూ.9.24 లక్షలు, ఎన్​ఆర్​ఈజీఎస్​ కింద హరితహారం మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించినందుకు రూ.14.75, నర్సరీ నిర్వహణ ఖర్చు కింద రూ.3.80 లక్షలు డ్రా చేసుకున్నట్లు తెలిసింది.

అయితే వీటిన్నటికి గ్రామ సభ ఆమోదం లేకపోవడం, కలెక్టర్​, డీపీఓ, ఇంజనీరింగ్​ ఆఫీసర్లు, ఇతర మండల స్థాయి ఆఫీసర్ల ఆమోదం లేకుండా నిధులు డ్రా అయినట్టు   సమాచారం. ఈ నిధులను రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు.

 కాగా.. పోలేపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పంచాయతీ పరిధిలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని.. సెక్రటరీగా పని చేసిన శివ ప్రసాద్ పంచాయతీ రికార్డులు అప్పగించకపోవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారులకు కంప్లైంట్​ చేస్తానని గత వారం ప్రెస్​మీట్​లో స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన ఉన్నతాధికారులు పంచాయతీలో జరిగిన అవకతవకలపై తాజాగా విచారణ చేపట్టారు.