వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (78) ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 20న నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం విరాళాల సేకరణ కూడా మొదలైంది. విరాళాల సేకరణలో భాగంగానే ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్(54) దంపతులతో ప్రైవేట్ డిన్నర్ ఆఫర్ వెలువడింది. ఎవరైతే 2 మిలియన్ డాలర్లు(రూ.17 కోట్లు) చెల్లిస్తారో వారు.. జనవరి 19న ట్రంప్ దంపతులతో గడపవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేయవచ్చని అమెరికా వార్తా సంస్థలు తెలిపాయి. 'ట్రంప్ వాన్స్ ఇనాగరల్ కమిటీ బెనిఫిట్స్' పేరిట జనవరి 17 నుంచి 20 వరకు జరిగే ఎనిమిది ఈవెంట్‌లకు ఫ్రీగా ఆరు టిక్కెట్‌లను అందజేయనున్నట్లు వెల్లడించాయి.
2 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎలైట్ డోనర్‌లు మొదట జనవరి18న అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌లతోనూ డిన్నర్ చేయవచ్చని తెలిపాయి.19న ట్రంప్ దంపతులతో స్పెషల్ డిన్నర్ ఉంటుందని వివరించాయి. వీటితో పాటు పలు హై-ప్రొఫైల్ ఈవెంట్‌లలో పాల్గొనేందుకు చాన్స్ దక్కించుకుంటారని చెప్పాయి. 20న జరిగే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫ్రీ టిక్కెట్లు కూడా అందుకుంటారని పేర్కొన్నాయి. ట్రంప్ ప్రమాణస్వీకారం కోసం నిధుల సమీకరణకు పరిమితి లేదు. అయితే, విరాళం 200 డాలర్లకంటే ఎక్కువ ఉంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు నివేదించాలి.