మిల్లర్లు, బిడ్డర్ల దొంగాట..రూ.16 వేల కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని డ్రామాలు

  • మిల్లర్ల దగ్గర రూ.11 వేల కోట్లు, బిడ్డర్ల దగ్గర రూ.5 వేల కోట్ల ధాన్యం పెండింగ్
  • గడువు ముగిసినా సివిల్ సప్లయ్స్ శాఖకు అందని బకాయిలు
  • రెవెన్యూ రికవరీ యాక్ట్​ ప్రయోగిస్తున్నా ఆశించిన ఫలితం ఉండట్లే
  • సీఎంఆర్ కొత్త గైడ్​లైన్స్​తో మిల్లర్లకు కళ్లెం వేయాలని   సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొందరు మిల్లర్లు, బిడ్డర్లు తోడుదొంగల్లా మారారు. ఏకంగా రూ.16 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని తమ దగ్గర పెట్టుకొని బకాయిలు చెల్లించకుండా డ్రామాలు ఆడుతున్నారు. సివిల్ సప్లయ్స్ శాఖ రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్​కు ఇస్తే, వాటిని బియ్యంగా మార్చి సకాలంలో ఇవ్వాల్సిన మిల్లర్లు ఏండ్లకు ఏండ్లు  పెండింగ్ పెడ్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల మొన్నటి యాసంగి సీజన్​వరకు మిల్లర్ల వద్ద దాదాపు రూ.11వేల కోట్ల విలువైన ధాన్యం పేరుకుపోయింది.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సివిల్​సప్లయ్స్ అధికారులతో దాడులు చేయిస్తే, మెజారిటీ మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు తేలింది. 

దీంతో కేసులు పెట్టి, రెవెన్యూ రికవరీ యాక్ట్​ ప్రయోగించి, ఆస్తులను సీజ్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాగైతే లాభం లేదని 2022–23 యాసంగి సీజన్​కు సంబంధించిన రూ.7 వేల కోట్ల విలువైన 35 లక్షల టన్నుల వడ్లను టెండర్ల ద్వారా బిడ్లర్లకు అమ్మితే... గడువు ముగిసినా ధాన్యాన్ని తీసుకెళ్లకుండా, బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారు.సివిల్ సప్లయ్స్​శాఖ ప్రతి సీజన్​లో బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకొని రైతుల నుంచి వడ్లు సేకరిస్తున్నది. ఇలా కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు ఇచ్చి, వారు మరాడించిన బియ్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐకి లెవీ పెడ్తుంది. ఎఫ్​సీఐ నుంచే రేషన్​షాపుల ద్వారా పేదలకు ఉచిత బియ్యం అందుతాయి. 

అయితే బీఆర్ఎస్​హయాంలో మిల్లర్లపై పర్యవేక్షణ కరువై ‘వాళ్లు ఆడింది ఆట.. పాడింది పాట’ అన్నట్టుగా మారింది. ఎలాంటి బ్యాంక్​గ్యారంటీ లేకుండా, కనీసం మిల్లులు ఉన్నాయో లేదో వెరిఫై చేయకుండా వ్యాపారులు, మిల్లర్లకు భారీ మొత్తంలో వడ్లను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా  వందలాది మంది మిల్లర్లు, వ్యాపారులు వడ్లను మిల్లింగ్ చేసి  బహిరంగ మార్కెట్​లో బియ్యం అమ్ముకున్నారు. అలా వచ్చిన  డబ్బును కొందరు రియల్​ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. చాలా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కో మిల్లర్​వద్ద రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 

కొందరు అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తూ సీఎంఆర్​పై నిర్లక్ష్యం వహించడం వల్లే  సీజన్ల కొద్దీ సీఎంఆర్​పెండింగ్​పడిపోయి వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2014 నుంచి  గత తొమ్మిదేండ్లలో మిల్లర్ల వద్ద దాదాపు  రూ.11వేల కోట్లకు పైగా విలువైన ధాన్యం ఇప్పటికీ పెండింగ్​ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఆయా మిల్లుల్లో వడ్లు లేకపోవడంతో ఇక  సర్కార్ రెవెన్యూ రికవరీ యాక్ట్​ను నమ్ముకుంది. రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి,  ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తున్నది. 

పలువురు మిల్లర్ల స్థిర, చరాస్తులను సీజ్​చేసి వేలం వేస్తున్నా.. వాళ్లకు కేటాయించిన మొత్తంలో సగం కూడా రావడం లేదని సివిల్​సప్లయ్స్ ఆఫీసర్లు వాపోతున్నారు. ఉదాహరణకు మెదక్ జిల్లా నర్సాపూర్​కు చెందిన శ్రీధర్​గుప్తా అనే రైస్​మిల్లర్​రూ.47 కోట్ల విలువైన సీఎంఆర్​ధాన్యం బకా యిపడగా.. బుధవారం ఆయనకు చెందిన 1.31 ఎకరాలను వేలం వేస్తే వచ్చినవి  2.12 కోట్లు మాత్రమే. 

కొత్త గైడ్ లైన్స్ తోనే మిల్లర్లకు కళ్లెం

గత బీఆర్ఎస్​సర్కార్ నిర్వాకం వల్ల గడిచిన తొమ్మిదేండ్లలో సివిల్​సప్లయ్స్ శాఖ రూ.58 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ లోన్లకు ఏటా రూ.3,645.25 కోట్ల వడ్డీలు కడుతున్నది. అప్పట్లో పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల అవినీతికి తోడు బ్యాంకు ష్యూరిటీలు తీసుకోకుండా మిల్లర్లకు వడ్లను ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్​సర్కార్ గుర్తించింది. మిల్లర్లకు ఎలాంటి షరతుల్లేకుండా వడ్లను ఇచ్చి, ఆ తర్వాత బాధపడితే లాభముండదని.. ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని నిర్ణయానికి వచ్చింది. 

ఈ క్రమంలోనే సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అధికారులు సీఎంఆర్​కు సంబంధించి కొత్త గైడ్​లైన్స్ రూపొందిస్తున్నారు. ఈ వానకాలం సీజన్​నుంచి మిల్లులు, వాటి కెపాసిటీ ఆధారంగానే ధాన్యం కేటాయించనున్నారు. అలాగే గతంలో ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లను ఈసారి పూర్తిగా పక్కనపెట్టాలని నిర్ణయించారు. సీఎంఆర్​కు కేటాయించిన వడ్లకు బ్యాంక్​గ్యారంటీ తప్పనిసరి చేయనున్నారు. ఇక అధికారుల తనిఖీల్లో వడ్లు తక్కువగా ఉన్నట్టు తేలితే  క్రిమినల్​చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు.

మిల్లర్ల బాటలోనే బిడ్డర్లు

2022–23 యాసంగిలో రైతుల నుంచి సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ శాఖ 66.84 లక్షల టన్నుల వడ్లను సేకరించింది. మిల్లింగ్​చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పటి బీఆర్ఎస్​సర్కార్ దాదాపు సగం ధాన్యాన్ని అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాత అధికారం కోల్పోవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్​ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసి.. గత జనవరి 25న 35 లక్షల టన్నుల వడ్లకు కొత్త టెండర్లు పిలిచింది. బిడ్‌‌‌‌లు దాఖలు చేసిన 26 కంపెనీలకు ఈ ధాన్యాన్ని అప్పగించారు. వీరంతా మిల్లర్ల నుంచి ధాన్యం తీసుకుని రూ.7వేల కోట్లను సివిల్​ సప్లయ్స్​కు చెల్లించాల్సి ఉంది. సెప్టెంబరు 23కు గడువు ముగిసినా ఇప్పటి వరకు బిడ్డర్లు కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే సివిల్​ సప్లయ్స్​కు చెల్లించారు. ఇంకా రూ.5వేల కోట్లు పెండింగ్​పడ్డాయి.