విద్యకు 15 శాతం బడ్జెట్ ​కేటాయించాలి

కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి  భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ.. పేదరికం, అసమానతలను తగ్గించడానికి శక్తిమంతమైన సాధనాలలో విద్య ఒకటి అని తెలిపారు.  విద్య కోసం ప్రభుత్వాలు తగినస్థాయిలో నిధులను కేటాయించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యకు సరిపడా నిధులు కేటాయించలేదని, అన్ని రాష్ట్రాల జాతీయ సగటు 14.7 శాతం కాగా తెలంగాణ కేవలం 7.6 శాతంతో.. జాతీయ సగటులో సగం మాత్రమే నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకారం విద్యకు 15 శాతం కేటాయించవలసిన అవసరం  ఉంది.

ALSO READ : సంహితలో ఎఫ్ఐఆర్​పై స్పష్టత కరువు

తెలంగాణ విద్య సంక్షోభంలో ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.  జూన్ లో తెరిచిన ప్రభుత్వ బడులు, సంక్షేమ హాస్టళ్లు,  గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.  రాష్ట్రంలో 30,306 పాఠశాలల్లో చదువుతున్న 28,95,456 మంది విద్యార్థులు, 2020 సంక్షేమ హాస్టళ్లలో ఉండి పాఠశాలలకు వెళుతున్న 3 లక్షల 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, అలాగే 35 వేల అంగన్వాడీ సెంటర్ల లో ఉన్న మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న 3 లక్షల మంది విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విద్యా సంస్థలన్నీ విద్య శాఖ, శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నడుస్తునాయి. 

సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత

విద్యా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 వేల స్కూల్స్ లో మౌలిక వసతులను తీర్చిదిద్దాలి. జాతీయ స్థాయిలో Performance Grading Index (PGI) ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మన రాష్ట్రం 21వ స్థానంలో ఉంది.  విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నా అత్యధిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదు. విద్యా హక్కు చట్ట ప్రకారం స్కూల్స్ ను తీర్చిదిద్దడానికి తగినన్ని నిధులను కేటాయించాలి.   రాష్ట్రంలో ఉన్న ఉన్నత పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల నమూనాలో మౌలిక సదుపాయాలు, కంప్యూటర్లు  ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, సబ్జెక్ట్ వారీ టీచర్స్, కంప్యూటర్ టీచర్,  పీఈటీ,  లైబ్రేరియన్, మ్యూజిక్, డ్రాయింగ్​టీచర్లను నియమించాలి.  విద్యా ప్రమాణాల్లో  మన రాష్ట్రం కేంద్ర నివేదిక ప్రకారం 35 వ స్థానంలో ఉంది. మెరుగైన విద్యను అందించాలంటే బడిలో ఉన్న పిల్లల సంఖ్యనుబట్టి టీచర్లను నియమించాలి. 

ALSO READ : సర్కార్ భూముల్లో..ప్లాట్ల దందా!

పారిశుద్ధ్యాన్ని పరిరక్షించాలి

ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు స్కావెంజర్లుతో పాటు అవసరమైన కాపలాదారులు, అటెండర్లును గత 4 సంవత్సరాల నుంచి నియమించలేదు. బడ్జెట్ లో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  హై స్కూల్ విద్యార్థులు తమ గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు లేక బడులు మానివేస్తున్నారు.  ఇలాంటి విద్యార్థులకు ప్రజా రవాణా సౌకర్యం లేదా రవాణా పారితోషికాన్ని అందించాలి.  విద్యాశాఖలో  పర్యవేక్షణ అధికారుల పాత్ర చాలా ముఖ్యం. రాష్ట్రంలో  డి.ఇఓ, ఎంఇఓలు,  డైట్ సిబ్బంది SCERT  తదితర 1,497మంది పర్యవేక్షణ అధికారులు అవసరం ఉండగా కేవలం 253 మాత్రమే పని చేస్తున్నారు. 1,244 ఖాళీలు ఉన్నాయి. వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలి. కాగా, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు 54 వేల మంది కార్మికులు మధ్యాహ్న భోజనం వండి పెడతారు. ఈ కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద బీమా,  పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. వీరి సేవలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి.

కేజీబీవీలకు నిధులు కేటాయించాలి

రాష్ట్రంలో ఉన్న 475 కేజీబీవీలలో దాదాపు లక్షా పదిహేను వేల మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. వీటిలో పనిచేసే చాలామంది భోదన,  భోదనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మౌలిక వసతులను, బాలికలకు నివాసయోగ్యమైన అన్నిసౌకర్యాలను కలిగించడానికి నిధులు కేటాయించాలి. అన్నిశాఖలలో ఉన్న 850 గురుకులాలలో దాదాపు 3లక్షల47వేల మంది విద్యార్థులుచదువుకుంటున్నారు. అలాగే 1,523సంక్షేమ హాస్టళ్లలో మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న ఈ గురుకులాల హాస్టళ్లు చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. సంక్షేమ హాస్టళ్లు అన్నీ విద్యార్థులు నివసించే యోగ్యంగా లేవు.  850 గురుకులాలు 415 కిరాయి భవనాలలో నడుస్తున్నాయి.  ఒక్క బీసీ గురుకుల భవనాలకే 7వేల కోట్లు అవసరం అని ఇంజినీర్లు ఒక అంచనా వేశారు. యుద్ధప్రాతిపదికన ఈ భవనాలను మౌలిక వసతులను కల్పించడానికి నిధులను కేటాయించాలి. 

పూర్వ ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలి

పూర్వ ప్రాథమిక విద్య అవసరం అని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించాలి. అంగన్వాడీ కేంద్రాలలో దీనికిగాను ప్రత్యేక టీచర్ ను నియమించాలి. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి. డ్రాపవుట్స్ ను అరికట్టి బాల కార్మిక రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలి.  కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణలో 27.4శాతం విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేయకుండానే బడి మానివేస్తున్నారు. బడి మానేసిన పిల్లలంతా బాల కార్మికులుగా మారిపోతారు. ఈ పిల్లలందరిని బడికి తీసుకురావడానికి బ్రిడ్జి కోర్సులు ఏర్పాటుకు నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలి.  వనరుల కల్పనలో రాజీ పడకుండా   నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే బాలలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్​లో విద్యకు 15%  నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాం.

- ఆర్. వెంకట్ రెడ్డి జాతీయ కన్వీనర్,ఎం.వి. ఫౌండేషన్