నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మంది మృతి

  • మరో 50 మందికిపైగా గాయాలు
  • బోల్తాపడిన ట్యాంకర్ నుంచి పెట్రోల్
  • తీసుకెళ్లేందుకు జనం ప్రయత్నిస్తుండగా మంటలు

జిగావా(నైజీరియా): నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలు కాగా ఆస్పత్రులకు తరలించారు. జిగావా రాష్ట్రంలోని మజియా టౌన్​లో బోల్తాపడిన ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీస్కెళ్లేందుకు జనం ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పెట్రోల్ తీస్కెళ్లేందుకు జనంఎగబడ్డరు.. 

మంగళవారం అర్ధరాత్రి హైవేపై ప్రయాణిస్తుండగా డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ట్యాంకర్ బోల్తా పడింది. లీకవుతున్న పెట్రోల్ తీసుకెళ్లేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ట్యాంకర్​ను చుట్టుముట్టారు. బిందెలు, బకెట్లలో పెట్రోల్ నింపుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 97 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. 

కాలిన గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ మరో 43 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలదాకా మంటలను ఆర్పడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్న మృతదేహాలకు బాధితుల బంధువులంతా కలిసి బుధవారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.