- వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్వో, వీఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం!
- ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు
- ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లలో ఖాళీల నోటిఫై
- కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్‌ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా 13 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 12 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా మరో వెయ్యికిపైగా సర్వేయర్ పోస్టులు యాడ్ కానున్నాయి. ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. గ్రామ పాలనాధికారి పోస్టుల్లోకి వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి.. దాదాపు 22 వేలకు పైగా వీఆర్వో, వీఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది.
ఇందులో నుంచే అర్హత కలిగిన 12 వేల మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వీరు ఆయా పోస్టులకు వెళ్తే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్లీ ఖాళీ కానున్నాయి. ఇందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్వన్నీ ఖాళీలుగా గుర్తించాలని.. ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ఆర్థికశాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది. కేవలం గ్రామ పాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికిపైగా సర్వేయర్ పోస్టులకు కూడా వీఆర్వో, వీఆర్ఏల నుంచే తీసుకోవాలనుకుంటున్నది.
Also Read : వరంగల్, కరీంనగర్.. జీసీసీలకు డెస్టినేషన్లు
దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో వెయ్యి మందికిపైగా రెవెన్యూ, సర్వే శాఖకు వెనక్కి వస్తారు. దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడుతాయి. అయితే.. వారసత్వ వీఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో కొత్త మండలాల్లోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా మండలాల్లోనూ కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా 13 వేలకుపైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపిస్తలే
గ్రామ పాలనాధికారులుగా వచ్చేందుకు వీఆర్వోలు, వీఆర్ఏల్లో(ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్నవారు) ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. 12వేల గ్రామ పాలనాధికారులను పాత వీఆర్వోలు, వీఆర్ఏల్లో నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటి వరకు 3వేల లోపు మందే సమ్మతం తెలుపుతూ దరఖాస్తును నింపారు. ఇంకొంత కాలం చూసి.. వాటికి సరిపడా పాతవాళ్లు రాకపోతే.. ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండటం.. ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు.
అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండటంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నట్లు తెలిసింది. మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు వీఆర్వోలను నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లారు. దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ, ప్రమోషన్లు ఉండటంతో మళ్లీ గ్రామ పాలనాధికారిగా వెనక్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది.
జిల్లా, మండల స్థాయిల్లో సరిపడా లేని సిబ్బంది
రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు, 612 మండలాలు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు, పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులనే కొత్త వాటిలోకి అడ్జస్ట్ చేశారు. అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు మూడు వేలకుపైగా పోస్టులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు నాడు సర్కార్ అనుమతించింది. కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్డ్ పోస్టులు మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది. కానీ, అలా చేకుండా పాత వారితోనే సర్దుబాటు చేసింది.
కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ, మండల కేంద్రంలో ఉండే ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎక్కడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఆఫీసర్ల పోస్టులతోపాటు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తున్నది. దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.