ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో సంచలనం నమోదైంది. 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ కోటీ పది లక్షలకు దక్కించుకుంది. వేలంలో వైభవ్ కోసం ముంబై, ఢిల్లీ, రాజస్థాన్ హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ 1.10 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో డేవిడ్ వార్నర్, విలియం సన్ వంటి అగ్రశేణి ఆటగాళ్ల అన్ సోల్డ్ ప్లేయర్లుగా నిలువగా.. పదమూడేళ్ల చిచ్చర పిడుగు వైభవ్ వంశీ కోటి పది లక్షలకు అమ్ముడుపోవడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది. 

ఎవరీ వైభవ్ సూర్యవంశీ..?

సూర్యవంశీ స్వస్థలం.. బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామం. ఇది సమస్తిపూర్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తండ్రి పేరు.. సంజీవ్ సూర్యవంశీ. 2011, మార్చి 27న జన్మించిన  ఈ బుడతడు.. నాలుగేళ్ళ వయస్సులో మొదటిసారి బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్.. కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. అక్కడే అతనికి రోజంతా గడిచిపోయేది. ఇరుగుపొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్‌కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి  అతన్ని సమస్తిపూర్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండున్నరేళ్ల శిక్షణ అనంతరం పదేళ్ల ప్రాయానికి అండర్- 16 క్రికెట్‌లోకి ప్రవేశించాడు.

పదేళ్ల వయస్సులోనే వైభవ్.. బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ ఔరా అనిపించాడు. హేమన్ ట్రోఫీ, అంతర్-జిల్లా టోర్నమెంట్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లలో దాదాపు 800 పరుగులు చేశాడు. అదే ఫామ్‌ను వినూ మన్కడ్ ట్రోఫీలోన్యూ కొనసాగించాడు. 5 మ్యాచ్‌ల్లో 400కు పైగా పరుగులు చేశాడు. ఇక్కడే అతని దిశ తిరిగింది. బీహార్ బోర్డు దృష్టిలో పడ్డాడు.

ఈ ఏడాదే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం

ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ రాష్ట్రం తరుపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతని వయస్సు.. 12 ఏళ్ల 284 రోజులు. అనంతరం భారత అండర్19 టీమ్‌కి ఎంపికైన ఈ బుడతడు.. ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లోనూ ఆడుతున్నాడు. ఇది అతని కెరీర్ ప్రారంభ దశ అయినప్పటికీ, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.