ఒక షార్ట్ ఫిల్మ్ ఆమె ఆలోచనని మార్చేసింది. ఒక నిర్ణయం ఆమె లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. తనకు తెలియకుండానే యాక్టింగ్ మీద ఇష్టం పెంచుకుంది. ఆ ఇష్టంతోనే ఆరేండ్లు కష్టపడింది. ప్రస్తుతం‘12th ఫెయిల్’ సినిమాతో నటనలో ఫుల్ మార్కులు కొట్టేసింది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మేధా శంకర్. నటన కోసం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిన మేధ సక్సెస్ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇవి.
‘‘మాది ఢిల్లీ. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకునేదాన్ని. బాగా చదివేదాన్ని. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఐదేండ్లు హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. డాన్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. డిగ్రీలో చేరేవరకు యాక్టింగ్ ఆలోచన లేదు. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశా. కాలేజీ ఫ్రెండ్ ఒకరు ఫొటోగ్రాఫర్. అతని ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండేవాడు. వాళ్లు యాక్టర్స్ కోసం వెతుకుతున్న టైంలో ఆడిషన్ ఇచ్చా. అది నా జీవితాన్ని మార్చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశా. అలా యాక్టింగ్‌తో లవ్‌లో పడిపోయా. ఆ టైంలో మోడలింగ్ కూడా ట్రై చేశా.
యాక్టింగ్ కోసం వెళ్లా
షార్ట్ ఫిల్మ్‌లో నటించాక నాకు లోతు మరింత తెలుసుకోవాలి అనిపించింది. మా పేరెంట్స్‌కి ‘యాక్టింగ్ చేయాలనుకుంటున్నా’ అని చెప్పా. మా ఫ్యామిలీలో చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతో మాస్టర్స్ చేశాక యాక్టింగ్‌లోకి వెళ్లమన్నారు. దాంతో ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసి ఆ తర్వాత ముంబై వచ్చా. ఒక్కసారి ఇక్కడికి వచ్చాక నన్నెవరూ ఆపలేదు. ప్రతి రెండేండ్లకు నాన్న ఫోన్ చేసి, ‘అది వదిలెయ్. నీకు అది సెట్ అవ్వదు. జాబ్‌కి ట్రై చెయ్’ అనేవాళ్లు. అప్పుడు నేను ‘మరో రెండేండ్లు టైం ఇవ్వండి నాన్న’ అని అడిగేదాన్ని. ఒకవేళ నేను యాక్టర్ కాకపోయి ఉంటే.. డైరెక్టర్, రైటర్... ఇలా ఏదైనా ఒక దాంట్లో ఉండేదాన్ని. నాకు సినిమాని విడిచిపెట్టడం ఇష్టంలేదు. తెలియని ప్లేస్‌లో కష్టమే. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు రావడం కష్టమే. కారణం... తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరు. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయో తెలియదు. కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా యాడ్స్‌కి మాత్రమే పిలుస్తారు. ఆ తర్వాత ఎప్పుడో ఫలానా ఆమె యాక్టింగ్ బాగుంటుంది. వెబ్ సిరీస్‌కి సూట్ అవుతుంది అనుకుంటే మళ్లీ పిలుస్తారు.
3ఆ తర్వాత మళ్లీ ఒకటి లేదా రెండు నెలలు గ్యాప్ వస్తుంది. అప్పుడు క్యారెక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్‌లా జరుగుతుంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్ చేతికి రావడం అనేది అంత ఈజీ కాదు. ఇలా ట్రై చేసేటప్పుడు ఎన్నోసార్లు రిజెక్షన్స్ ఎదుర్కొన్నా. ఆ టైంలో నాలోని ఆత్మవిశ్వాసం, పట్టుదలకు తోడు నా ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. చాలామంది ‘నువ్వు అందరితో మాట్లాడాలి. ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అప్పుడే ఛాన్స్‌లు వస్తాయి’ అని చెప్పేవాళ్లు. నాకేమో అదంతా తెలియదు. ‘‘మనం నిజాయితీగా ఉంటే చాలు. సరైన వాళ్లు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎంత కష్టం ఎదురైనా దాన్ని తట్టుకుని నిలబడగలగాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాం’’ అని బలంగా నమ్ముతా.
ఫేస్బుక్ ఫొటో చూసి..
కాస్టింగ్ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ యాక్టర్ కోసం ఫేస్బుక్లో వెతికేవాళ్లు. ఇది 2018 నాటి సంగతి. అలాగే ‘బీచమ్ హౌస్’ అనే బ్రిటిష్ సిరీస్ ‘బిహైండ్ ద సీన్’ పిక్చర్ ఒకటి పోస్ట్ చేశా. ఆ టైంలో రాజ్ సింగ్ తన ఫిల్మ్ లో ‘రోషనార’ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. నా ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ చూసి నన్ను సెలక్ట్ చేశారు. నా ఫేస్బుక్ ప్రొఫైల్ చూడగానే ఆర్షి క్యారెక్టర్‌కి చాలా దగ్గరిగా ఉంది అనుకున్నారట. అలా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. ఆడిషన్ చేశాక ఆ క్యారెక్టర్ నన్ను వరించింది.
12th ఫెయిల్‌లో...
కాస్టింగ్ ఏజెన్సీ నుంచి కాల్ వచ్చింది. ఆడిషన్‌కి వెళ్లా. అక్కడ డైరెక్టర్ ‘విధు వినోద్ చోప్రా’ ఆడిషన్ తీసుకున్నారు. తర్వాత స్క్రీన్ టెస్ట్‌కి రమ్మన్నారు. అది అయ్యాక రెండోసారి టెస్ట్‌కి పిలిచారు. ‘రెండోసారి టెస్ట్ ఎందుకు చేస్తున్నారు సార్? దీని తర్వాత మూడో టెస్ట్ కూడా ఉంటుందా’ అని అడిగా. అప్పుడు ఆయన నవ్వుతూ ‘విద్యాబాలన్ 26 సార్లు టెస్ట్‌కి వచ్చింది’ అన్నారు. అప్పుడు నేను ‘26,000 సార్లు అయినా స్క్రీన్ టెస్ట్‌కి నేను రెడీ’ అన్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లగానే ‘ఆడిషన్ ఎలా జరిగింది ?’ అని అడిగారు నాన్న. ‘నేను సినిమాలో నటించబోతున్నా’ అని కళ్ల నిండా నీళ్లతో చెప్పా. అప్పుడాయన ‘వాళ్లు నీకు ముందే చెప్పారా?’ అని అడిగారు. దానికి ‘లేదు. నేను చెప్తున్నా’ అన్నాను.
అలా నాకు ఎందుకు అనిపించింది అంటే... స్క్రీన్ టెస్ట్ అయిపోయాక అక్కడున్న వాళ్లందరి రియాక్షన్ గమనించా. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేస్తాననే నమ్మకం అప్పుడు ఏర్పడింది. అందుకనే అలా చెప్పా. స్క్రీన్ టెస్ట్ చాలా ఇంటెన్సిటీతో చేశా. అందుకే డైరెక్టర్ నన్ను సెలక్ట్ చేశారు. ఫైనల్లీ అనుకున్నట్టే ఒక వారం తర్వాత డైరెక్టర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ‘ఫోన్ మీ నాన్నకు ఇవ్వు’ అన్నారు. నాన్నని పిలిచి స్పీకర్ ఆన్ చేశా.. ‘శంకర్‌గారు మీ అమ్మాయి సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్‌కి సెలక్ట్ అయింది’ అని చెప్పిన క్షణాలని నేను జీవితంలో మర్చిపోలేను. ‘శ్రద్ధ క్యారెక్టర్ కోసం ఒక మంచి అమ్మాయి కావాలని వెతికాం. దానికి నువ్వు పర్ఫెక్ట్గా సూట్ అవుతావని సెలక్ట్ చేశాం’ అన్నారు.
ఆరేళ్ల కష్టానికి ఫలితం
ముంబైకి వచ్చి ఆరేండ్లు అవకాశాల కోసం ప్రయత్నించా. ఇప్పుడు దానికి ఫలితం దక్కింది. అయితే, బయటి ఊరి నుంచి వచ్చా కాబట్టి మొదటి ఏడాదంతా ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి? వాటి అడ్రెస్లు కనుక్కోవడానికి సరిపోయింది. ఆ తర్వాత కాస్టింగ్ ఏజెన్సీలకు వెళ్లి ఫొటోగ్రాఫ్‌లు ఇచ్చా. ఆ తరువాత కొంతకాలానికి నన్ను బాగా నటిస్తానని గుర్తించడం మొదలైంది. యాడ్స్‌లో యాక్టింగ్ చేసే ఛాన్స్‌లు ఉన్నాయని చెప్పేవాళ్లు. అలా ఎన్నో అడ్వర్టైజ్‌మెంట్స్‌కు ఆడిషన్స్ ఇచ్చా. కానీ, ఒక్కదాంట్లో కూడా సెలక్ట్ కాలేదు. దాంతో 2019, నవంబర్‌లో ‘ఇక మీదట యాడ్స్‌కి ఆడిషన్ ఇవ్వకూడద’ని డిసైడ్ అయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్లకు ఒక్క ఆడిషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క యాడ్‌కి కూడా సెలక్ట్ కానప్పుడు నా ఎనర్జీ, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అనిపించింది.
పని చేస్తూ పోతే...
సినిమాల్లోకి వచ్చే ముందువరకు ఇన్‌స్టాగ్రామ్‌లో16వేల మంది ఫాలోవర్లు ఉండేవాళ్లు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో అంతమంది ఫాలోవర్లు ఉండడం పెద్ద విషయం కాదు. 2018–19లో నేను ఒక యాడ్ షూటింగ్ కోసం ఆడిషన్‌కి వెళ్లా. అక్కడ నన్ను అడిగిన ప్రశ్న ‘మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారు?’ అని. ‘నాకున్న ఫాలోవర్ల సంఖ్య బట్టి అవకాశం ఇస్తారా? అలా అయితే నేను ఈ యాడ్ చేయను. నా యాక్టింగ్ చూసి ఇస్తే ఇవ్వండి. లేదంటే వెళ్లిపోతా’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయా. నా నటన నచ్చి ఫాలో అవుతారు. అలా ఎంతమందికి నచ్చితే అంతమంది ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుంది. నా పనిని చూసి నాకు అవకాశం ఇవ్వాలి. కానీ, ఫాలోవర్ల సంఖ్య బట్టి కాదు అనేది నా ఉద్దేశం.
బహుశా ఫాలోవర్లను బట్టి ఛాన్స్‌లు తెచ్చుకునే వాళ్లు ఉండొచ్చు. కానీ నాకు అలాంటి ఛాన్స్‌లు వద్దే వద్దు. నా వరకు నేను బాగా యాక్టింగ్ చేయగలను. దాని ద్వారా అభిమానుల్ని సంపాదించుకుంటాననే నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు నా దృష్టంతా కంటెంట్ మీదనే. అప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తున్నా. యాక్టర్‌గా నేను అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఇంతకుముందు గ్రే షేడ్స్ ఉన్న పాత్ర, టామ్ బాయ్‌లాంటి క్యారెక్టర్స్ చేశా” అని యాక్టింగ్ జర్నీలో ఎదురైన స్పీడ్ బ్రేకర్స్ నుంచి తను తీసుకున్న సీరియస్ డెసిషన్స్ గురించి చెప్పింది మేధ.
వంద రూపాయలు...
ఆ రోజు12th ఫెయిల్ షూటింగ్లో నేను పాట పాడే సీన్ చేస్తున్నాం. యాక్టర్ లేదా టెక్నీషియన్ బాగా చేస్తే వాళ్లకు క్లాప్స్ కొట్టి 20 రూపాయలు ఇచ్చే అలవాటు ఉందట డైరెక్టర్‌కి. ఆ రోజు నేను పాట పాడే సీన్ అయిపోయాక ఆయన నాకు100 రూపాయలు ఇచ్చారు. అందరికీ 20 రూపాయలు ఇచ్చే ఆయన నాకు వంద రూపాయలు ఇచ్చారని హ్యాపీగా ఫీలయ్యా. షూటింగ్ అయిపోయాక పేపర్ మీద ‘డైరెక్టర్ నా పర్ఫార్మెన్స్కి వంద రూపాయలు ఇచ్చార’ని రాసి, ఆయనతో సంతకం పెట్టించుకున్నా. దాన్ని గుర్తుగా ఫ్రేమ్ కట్టించుకుని మా ఇంట్లో గోడకు తగిలించా.
మొదట్లో నాన్న సపోర్ట్ లేదు..
మా ఇంట్లో నన్ను బాగా సపోర్ట్ చేసింది మా అమ్మ, బ్రదర్. మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడే మా అమ్మ కొన్ని కాంటాక్ట్స్, ఫొటోలు తీసుకొచ్చి ‘తరువాత ఇవి ట్రై చెయ్’ అని చెప్పేది. మా బ్రదర్ కూడా బాగా సపోర్ట్ చేసేవాడు. మొదట్లో నాన్న అస్సలు సపోర్ట్ చేయలేదు. తర్వాతర్వాత నా తపన, పట్టు దల, కష్టం చూసి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నా బిగ్గెస్ట్ సపోర్టర్ మా నాన్నే.