వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద 

  •     రూ.700 కోట్లతో నల్గొండ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు 
  •     రూ.450 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం
  •     టీసీఎస్ ​కంపెనీతో ఐటీ టవర్​లో ఉద్యోగాలు 
  •     స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ పనులు షురూ
  •     త్వరలో క్యాన్సర్​ఆస్పత్రి ఏర్పాటు

నల్గొండ, వెలుగు :  నీలగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల వరదొచ్చింది. కాంగ్రెస్​ సర్కార్​అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తన నియోజకవర్గానికి సుమారు రూ.700 కోట్ల పనులు శాంక్షన్​ చేయించారు. మొత్తం రూ.1630 కోట్లతో ప్రణాళికలు రూపొందించగా, దాంట్లో రూ.700 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నల్గొండను తెలంగాణలోనే మోడల్​నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. వచ్చే మూడేళ్లలో నల్గొండ రూపురేఖలు మార్చేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు, యువకులు, నిరుద్యోగులు, చిరువ్యాపారులు, దళితులు, మైనార్టీలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్​చేశారు. రోడ్లు తాగునీరు, సొంత ఇల్లు నిర్మాణాలు చేపట్టున్నారు. హైదరాబాద్​నగరానికి ధీటుగా నల్గొండ చుట్టూ రూ.700 కోట్లతో ఔటర్​రింగ్​రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. 

తాగునీరు, అండర్ గ్రౌడ్​డ్రైనేజీకి భారీగా నిధులు.. 

నీలగిరి మున్సిపాలిటీలో 49 వార్డులు, దాదాపు 15 వార్డులు శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ వార్డుల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ వార్డులకు ఆనుకుని రియల్​ఎస్టేట్​వెంచర్లు, గేటెడ్​ కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కనీసం మౌలిక వసతులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో తాగునీరు, అండర్​గ్రౌడ్​డ్రైనేజీ, గ్రామాల్లో మిషన్​భగీరథ నీటి సరఫరాలో అవాంతరాలు తొలగించేందుకు రూ.450 కోట్లు కేటాయించారు. ప్రస్తుతానికి రూ.140 కోట్లు శాంక్షన్​ చేయగా, మరో రూ.300 కోట్ల పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. 

యువతకు ఉపాధి కల్పన..

నల్గొండలో నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రూ.20 కోట్లతో నల్గొండలో స్కిల్​డెవలప్​మెంట్​సెంటర్​నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా గత ప్రభుత్వం రూ.90 కోట్లతో నిర్మించి హడావుగా పడేసిన ఐటీ టవర్​లో టీసీఎస్​ కంపెనీతో ఒప్పందాలు జరుగుతున్నాయి. మూడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా టీసీఎస్​ కంపెనీతో చర్చలు జరుపుతున్నారు. 

నల్గొండలో క్యాన్సర్​ఆస్పత్రి.. 

నల్గొండలో క్యానర్​ఆస్పత్రి నిర్మాణానికి ప్లాన్​ జరుగుతోంది. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్​ ఆస్పత్రి నెలకొల్పుతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ స్థలం కోసం పరిశీలన జరుగుతోంది. జూన్​లో కొత్త మెడికల్​ కాలేజీ ఓపెన్ కానుంది. ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న మెడికల్​కాలేజీని అక్కడికి షిఫ్ట్​ చేశాక, ఇక్కడున్న ఆస్పత్రిని కార్పొరేట్​స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్లాన్​చేస్తున్నారు.

రూ.90 కోట్లతో నీలగిరి నిలయం..

రూ.90 కోట్లతో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కళాభారతి నిర్మిస్తానని చెప్పి దాటవేసింది. కాగితాలపైనే తప్ప కళాభారతి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే ప్లేస్​లో నీలగిరి నిలయం పేరుతో భారీ భవనాన్ని నిర్మించనున్నారు. దీంట్లో ఫంక్షన్​హాల్స్, రెండు వేల సామర్ధ్యం గల డైనింగ్​హాల్, కాన్ఫరెన్స్​హాల్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక ప్రాంగణం, సెంట్రల్​ ఏసీతో నిర్మించనున్నారు.