ఏసీబీ వలకు చిక్కుతున్న అవినీతి చేపలు..!

  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 8 నెలల్లోనే పట్టుబడిన 12 మంది ఆఫీసర్లు
  • ఏసీబీ దాడులతో అవినీతిపరుల్లో భయం
  • లంచం అడిగితే నిర్భయంగా సమాచారమివ్వాలని అధికారుల సూచన

మహబూబాబాద్, వెలుగు: అవినీతి చేపలు ఏసీబీ వలలో చిక్కుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వస్తుండడంతో అవినీతికి అలవాటు పడ్డ ఆఫీసర్ల పని పట్టేందుకు పలువురు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు సైతం మెరుపు దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు. ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా 8  నెలల్లో 12 మంది అవినీతి పాల్పడిన వారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

పని కావాలంటే చేయి తడపాల్సిందే..! 

భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పూర్తయిన పనులకు బిల్లులు మంజూరు చేయాలన్నా, ఇతర పనులకు విరివిగా లంచాలను డిమాండ్​ చేస్తున్నారు. వైద్య, విద్య, లేబర్, రవాణా, ఇరిగేషన్, దేవాదాయం ఇలా పలు శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు పట్టుబడ్డారు. మరికొన్ని శాఖల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు మధ్యవర్తులను నియమించుకుని మరీ లంచం పుచ్చుకుంటున్నారు.

మానుకోట డీటీవో రూ.2.97 కోట్లు మేర అవినీతి

మానుకోట జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) గౌస్ పాషా, ప్రైవేట్ అసిస్టెంట్ సుబ్బారావు, కారు డ్రైవర్ రాంగోపాల్ ను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. మే 28న మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏజెంట్ల నుంచి రూ.45,100, డీటీవో  డ్రైవర్ నుంచి రూ.16,500, జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.895 నగదును స్వాధీనం చేసుకున్నారు. 

దీంతోపాటు వివిధ లెక్కల్లో చూపని నగదు, మొబైల్ ను స్వాధీనం చేసుకుని ఖాతాలకు సంబంధించిన ఆన్ లైన్​  లావాదేవీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇందులో నేరారోపణలను ఆధారాలతో సహా గుర్తించారు. దీంతో ఏ-1గా గౌస్ పాషపై కేసు నమోదు చేశారు. గౌస్ పాష ఏడాదిన్నరక్రితం మహబూబాబాద్​జిల్లా రవాణాశాఖ అధికారిగా వచ్చారు. ఈ క్రమంలో ఏజెంట్లు, వాహన యజమానుల నుంచి రూ.2,97,38,000 లంచం వసూలు చేసినట్లు విచారణలో తేలింది. వచ్చిన నగదును అతడి ప్రైవేట్ అసిస్టెంట్ తణుకు రాంగోపాల్(ఏ-5) బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 

ఆ తర్వాత రాంగోపాల్ తన ఖాతా నుంచి మహ్మద్ గౌస్ పాషాతోపాటు అతడి కుమారుడు మహ్మద్ ఆరీఫొద్దీన్(ఏ-3), ఆరీఫొద్దీన్ మేనల్లుడు మహ్మద్ మునీర్(ఏ-4), ప్రైవేట్ అసిస్టెంట్ యల్లమందల సుబ్బారావు (ఏ-2) బ్యాంకు ఖాతాలకు ఆన్ లైన్​లో నగదు బదిలీ చేశాడు. నేరారోపణలు రుజువు కావడంతో  ఇటీవల నిందితులను అరెస్ట్ చేసి వరంగల్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అదేవిధంగా మానుకోట సబ్​ రిజిస్టర్ మహమ్మద్ తస్లీమాను ఈ ఏడాది మార్చి 22న ఏసీబీ ఆఫీసర్లు లంచం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆఫీస్​లో  డేటా ఆపరేటర్ ఆలేటి వెంకటేశ్​ద్వారా లంచాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి రూ.19,200 తీసుకుంటున్న క్రమంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.

తాజాగా ఆలయ ఈవో పట్టివేత..

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల శివారులో గంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఈ నెల 18న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆలయ ఆవరణలోని షాపు లైసెన్స్ పునరుద్ధరణ కోసం రూ.20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం గుడి ఆవరణలో రూ.20 వేల లంచం తీసుకుంటుండగా, అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.  బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండడంతో అవినీతి అధికారుల్లో వణుకుపుడుతోంది. ప్రజల్లో చైతన్యం వస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. 

భయపడకుండా సమాచారమివ్వండి..

ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకంగా చేయాల్సిన పనికి ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా ఏసీబీకి సమాచారం ఇవ్వండి. వరంగల్​ రేంజ్ డీఎస్పీ నెం.91543 88912, ఏసీబీ సీఐ నెం. 91543 88913, టోల్ ఫ్రీ నెం.1064 లో సంప్రదించవచ్చు.  సాంబయ్య, ఏసీబీ డీఎస్పీ, వరంగల్లు