దేశంలో కటిక పేదరికంలో 12 కోట్ల మంది

  • వరల్డ్​ బ్యాంక్​ నివేదికలో వెల్లడి
  • పేదరికం తగ్గట్లే.. కటిక దారిద్ర్యంలోనే 12.9 కోట్ల మంది
  • రోజు సంపాదన రూ.181 కంటే తక్కువ
  • వెల్లడించిన ప్రపంచబ్యాంకు నివేదిక

న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశంలో ఇంకా పేదరికం పోలేదు.  దేశంలోని 142 కోట్ల మంది  జనాభాలో 9 శాతం మందికిపైగా ప్రజలు కటిక పేదరికంలో మగ్గుతున్నట్టు వరల్డ్​ బ్యాంక్​ తాజా నివేదికలో వెల్లడించింది. 2024 నాటికి దేశంలో మొత్తం 12.9 కోట్లమంది అత్యంత పేదరికంలో ఉన్నట్టు తెలిపింది. 

వీరి సంపాదన రోజుకు రూ.181 కంటే తక్కువగా ఉన్నట్టు తేల్చింది.  జనాభాపరంగా చూస్తే 1990 లో కంటే 2024లోనే అత్యధిక మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నది. పేదరికానికి జనాభా పెరుగుదలే ప్రధాన కారణమని వెల్లడించింది. ప్రస్తుత దేశ పురోగతిని చూస్తే.. అత్యంత పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇంకా దశాబ్దాల కాలం పడుతుందని తెలిపింది.

మనదేశంలో పేదరికం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ విషయమై ప్రపంచ బ్యాంకు నివేదిక ఎన్నో చేదు నిజాలను బయటికి తెచ్చింది. దీని నివేదిక ప్రకారం..ఈ ఏడాది దాదాపు 12.9 కోట్ల మంది భారతీయులు కటిక పేదరికంలో జీవిస్తున్నారు.పేదల సంపాదన రోజుకు  2.15 డాలర్ల (సుమారు రూ. 181) కంటే తక్కువ ఉంది. సాధారణంగా మధ్య ఆదాయ దేశాల ప్రజల సంపాదన రోజుకు 6.85 (సుమారు రూ. 576) డాలర్లు ఉంటుంది. 

ఈ లెక్కన చూస్తే1990 కంటే 2024లో ఎక్కువ మంది భారతీయులు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు.  అల్పాదాయ దేశంగా ఉన్న1990లో పేదల సంఖ్య 43.1 కోట్లు ఉండేది.  అయితే, మధ్యస్థ ఆదాయం గల దేశాల ప్రమాణానికి అనుగుణంగా చూస్తే, పేదరికం పెరిగింది. ప్రధానంగా 'జనాభా పెరుగుదల' ఇందుకు కారణం. మనదేశంలో 2021 సంవత్సరంలో అత్యంత పేదరికంలో ఉన్న వారి సంఖ్య 3.8 కోట్లు తగ్గి16.74 కోట్ల మందికి పడిపోయిందని ‘పావర్టీ, ప్రాస్పరిటీ అండ్​ ప్లానెట్​: పాథ్​వేస్​ ఔట్​ ఆఫ్ ది పాలిక్రైసిస్​’ పేరుతో ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

 ఇటీవల విడుదల చేసిన 2022–-23 గృహ వినియోగం  వ్యయ సర్వే (హెచ్​సీఈఎస్​)లో ఈ కొత్త డేటాసెట్‌‌లను చేర్చలేదు. ప్రపంచ పేదరికం తగ్గింపు దాదాపుగా నిలిచిపోయింది. 2020–-2030 దశాబ్దంలోనూ పేదిరకం పెద్దగా తగ్గకపోవచ్చు. ప్రస్తుత పురోగతి ప్రకారం చూస్తే, తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించడానికి దశాబ్దాలు పడుతుంది.  ప్రజల ఆదాయాన్ని రోజుకు 6.85 డాలర్ల కంటే ఎక్కువ పెంచడానికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతుంది.  

ఈ అంచనాలు అన్నీ రాబోయే దశాబ్దంలో తలసరి జీడీపీ పెరుగుదలకు సంబంధించినవి. 2030లో భారతదేశంలో అత్యంత పేదరికం రేటును సున్నాకు చేరుతుందని భావించారు. అయితే 2030లో ప్రపంచ పేదరికం రేటు 7.31 శాతం నుంచి 6.72 శాతానికి మాత్రమే పడిపోతుందని, ఇది ఇప్పటికీ 3 శాతం లక్ష్యం కంటే చాలా ఎక్కువని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచంలో ఇప్పటికీ 8.5 శాతం మంది నిరుపేదలేనని సంస్థ రిపోర్టు వివరించింది.