- ఉమ్మడి జిల్లాలో రూ.3,461.76 కోట్లు మాఫీ
- సీఎంకు రుణపడి ఉంటామంటున్న రైతాంగం
- కొత్త రుణాలు తీసుకొనే చాన్స్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4,13,820 మంది రైతులకు నాలుగు విడతల్లో రూ.3,461.76 కోట్లు రుణమాఫీ జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఏండ్లుగా పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రుణాలను మాఫీ చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నాగర్ కర్నూల్, వెలుగు: ఒకటి కాదు.. రెండు కాదు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏకంగా 1.11లక్షల రైతు కుటుంబాలకు రుణభారం తప్పింది. రైతు కుటుంబాలకు చెందిన 6 లక్షల మందికి డైరెక్ట్‌గా రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పంట సాగు కోసం బ్యాంకుల్లో తీసుకున్న రుణం రూ.2 లక్షల వరకు మాఫీ కావడం కరవు నేలకు వరంగా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో నాలుగు విడతల్లో కలిపి 1,11,297 రైతు కుటుంబాలకు రూ.947.45 కోట్ల మాఫీ వర్తించింది. రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు వందల సంఖ్యల్లోనే ఉంటారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
మొదటి విడతలో 33,355 మంది రైతులు, రెండవ విడతలో 21,812 మంది రైతులు, మూడవ విడతలో 18,062 మంది రైతులు, నాల్గవ విడతలో 32,833 మంది రైతులు, జిల్లా సరిహద్దు అవతల ఉన్న బ్యాంకుల్లో 5,235 మంది రైతు కుటుంబాలు రుణమాఫీ కింద లబ్ధి పొందారు. పంట రుణాలు మాఫీ కావడం, వడ్ల కొనుగోలుకు కనీస మద్దతు ధర రూ.2300తో పాటు రూ.500 బోనస్‌తో క్వింటాల్‌కు రూ.2800 వరకు ధర పలుకుతుండడం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది.
రుణమాఫీతో ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇచ్చిందని అంటున్నారు. రైతుబంధు ఆలస్యమైనా రుణమాఫీతో తమ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యే పరిస్థితి నుంచి బయటపడడమే కాకుండా మళ్లీ రుణాలు తీసుకునే వెసులుబాటు దొరికిందంటున్న రైతులు, సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటామని చెబుతున్నారు.
పెరిగిన సాగు..
జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములు 7.12లక్షల ఎకరాల వరకు ఉన్నా.. బావులు, బోర్ల మీద ఆధారపడి సాగు చేసే రైతు కుటుంబాలు 20 వేల వరకు ఉండేవి. దివంగత సీఎం వైఎస్సార్‌హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2016లో ప్రారంభం కావడంతో, మరో లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. 2014లో అత్యధికంగా 60 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కేఎల్ఐ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో జిల్లా రూపురేఖలు మారిపోయాయి.
20 ఏండ్ల తరువాత కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ స్థాయి దాటని కేఎల్ఐ కింద వానాకాలం, యాసంగిలో కలిపి 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్యాకేజీ 28, 29, 30లో కాల్వలు, మైనర్లు, స్ట్రక్చర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. కేఎల్ఐ కింద 3 లక్షల ఎకరాలు, బోర్ల కింద లక్ష ఎకరాలు సాగవుతోంది. 3 లక్షల ఎకరాల సాగుకు వర్షాలపైనే ఆధారపడిన రైతు కుటుంబాలు ఉన్నాయి. వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న 3 లక్షల ఎకరాల రైతాంగానికి సాగునీటి భరోసా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం దక్కితే కరవు, వలసల జిల్లాగా పేరున్న జిల్లా రూపురేఖలు, రైతుల స్థితిగతులు మారిపోతాయి.
సర్కారు దృష్టి పెడితే..
ఇప్పటి వరకు వరి, వేరుశనగ, పత్తి పంటలను ఎక్కువగా సాగు చేస్తున్న రైతుల్లో.. వరి, పత్తి పండించిన వారికి ప్రభుత్వం నుంచి మద్దతు ధర లభిస్తోంది. ఆరుతడి, వాణిజ్య పంటల సాగు పెట్టుబడికి ఆర్థికసాయం, మార్కెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తే వ్యవసాయం, రైతుల మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చుకు ఫలితం దక్కుతుందన్న టాక్ ఉంది.