ఉత్తరప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

  • బస్సును ఢీ కొట్టిన పికప్ వ్యాన్.. మరో 27 మందికి గాయాలు

బులంద్​షహర్(యూపీ): ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షహర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ కార్మికులతో వెళుతున్న పికప్ వ్యాన్​ ఓ బస్సును ఢీ కొట్టింది. దీంతో వ్యాన్ లోని 11 మంది కార్మికులు చనిపోగా మరో 27 మందికి గాయాలయ్యాయి. బదౌన్– మీరట్ హైవేపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్​ నుంచి కార్మికులను తీసుకు వస్తున్న పికప్ వ్యాన్ డ్రైవర్ సాలెంపూర్ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. 

అదే సమయంలో ఓ ప్రైవేటు బస్సు ఎదురుగా రావడంతో వ్యాన్ దానిని ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు పికప్ వ్యాన్ లో ప్రయాణిస్తున్న కార్మికులలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. గాయపడ్డ 27 మందిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మీరట్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. మిగతా వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో బాధితులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బులంద్​ షహర్ కలెక్టర్ చంద్రప్రకాశ్​ సింగ్​ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆదేశాల మేరకు బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

బెంగాల్​లో ఆరుగురు..

బెంగాల్​లోని మాల్దా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. మరొకరు గాయాల పాలయ్యారు. శనివారం కలియాచక్ నుంచి మాల్దా టౌన్​కు కారు వెళ్తుండగా నేషనల్ హైవే–12పై ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు..

కర్నాటకలో నలుగురు

కర్నాటకలో బస్సును కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. గడగ్ జిల్లా నరగుండ్ తాలూకా కొన్నూరు గ్రామ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హవేరిలో జిల్లాలోని మారుతినగర్​కు చెందిన వారు.