రెఫరల్​ కేసులకే 108 సేవలు

  •     ప్రమాదాలు జరిగితే ప్రైవేటు అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లే దిక్కు
  •     పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలకు 8 వాహనాలు
  •     పెద్దపల్లి పారిశ్రామిక జిల్లాకావడంతో నిత్యం ప్రమాదాలు 
  •     అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ల కొరతతో అందని అత్యవసర సేవలు 

‘కరీంనగర్​కు చెందిన ఓ యువకుడు గోదావరిఖనిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరిగి తన టూ వీలర్​పై వెళ్తుండగా జవహర్​నగర్​లో అదుపుతప్పి డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సృహ తప్పి పడిపోయాడు. చుట్టపక్కల వారు గమనించి 108కు ఫోన్​ చేశారు. కానీ ఆ వెహికల్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో లేకపోవడంతో స్థానికులే మరో బైక్‌‌‌‌‌‌‌‌పై హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.’

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో 108 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ల కొరత వేధిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఉండగా కేవలం ఎనిమిది 108 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లే ఉన్నాయి. వీటిలో చాలావరకు రిఫరల్‌‌‌‌‌‌‌‌ కేసులకే వినియోగిస్తున్నారు.  దీంతో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందక ప్రాణాలు పోతున్నాయి. అత్యవసర సేవల కోసం ప్రతి మండలానికి 108 వెహికిల్​ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి ఒక వెహికిల్​తో పాటు బసంత్​నగర్

 మంథని, కమాన్​పూర్, పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్​, ధర్మారంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం రాజీవ్​ రహదారిపై రోడ్డు ప్రమాదాలతో పాటు ఎమర్జెన్సీ సేవలకు మూడు 108 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లు ఉండాలి. కానీ ఒక వాహనంతోనే సర్దుకుంటూ వస్తున్నారు. 

రెఫరల్​కే ఎక్కువ ప్రియారిటీ...

గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​కు 3 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎన్టీపీసీ సీఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద సమకూర్చగా, మరో రెండు వెహికల్స్​ తాజా మాజీ ఎంపీలు అందజేశారు. అయితే ఈ మూడింటిలో రెండు రిపేర్ల పేరుతో షెడ్​కు పరిమితమయ్యాయి. ఉన్న ఒక్క అంబులెన్స్​ను హాస్పిటల్​ ఆవరణలో పాత బ్లాక్​ నుంచి కొత్త బ్లాక్​కు సరుకుల రవాణాకు ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు హాస్పిటల్​కు వచ్చే గుండె, ఆస్తమా రోగులను కరీంనగర్​, వరంగల్​ ఎంజీఎం తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. 

అందుబాటులోకిరాని 108 వాహనాలు 

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా 108 కోసం ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి ఎదురు చూస్తుంటారు. గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, యైటింక్లయిన్​ కాలనీ తదితర ఏరియాల్లో రోడ్డు ప్రమాదం జరిగితే ఫోన్​ చేసినా 108 వాహనాలు రాకపోవడంతో చాలా  మంది ప్రైవేటు వెహికిల్స్​ ద్వారానే గాయాలపాలైన వారిని హాస్పిటళ్లకు తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ రెఫరల్​ కేసుల కోసం

వెళుతుండడంతో కొన్ని సందర్భాల్లో మంథని, బసంత్​నగర్​ నుంచి  108 అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లు వచ్చేదాక ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో తీవ్రంగా గాయపడినవారి ప్రాణాలు పోతున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాల శాతం ఎక్కువని, ఈ ప్రాంతానికి మరో మూడు అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లు సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.