అంబులెన్స్​లు లేక అవస్థలు! ఉన్న వాహనాలపై అదనపు భారం

  • ఉన్న వాహనాలపై అదనపు భారం
  • పేషెంట్ల తరలింపునకు తప్పని ఇక్కట్లు 
  •  డెడ్​బాడీల తరలింపు అంబులెన్సూ కరువు

జనగామ, వెలుగు : అవసరానికి సరిపడా 108 అంబులెన్స్ వాహనాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా మారినా వైద్య సేవల్లో అలసత్వం కనిపిస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల తీరుతో మంజూరు కావాల్సిన అంబులెన్స్​లు కూడా రాలేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉంటే కేవలం ఏడు అంబులెన్స్ లు మాత్రమే పనిచేస్తున్నాయి. పలుమార్లు ప్రజా ప్రతినిధులు కోరినా ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా పేషంట్ల తరలింపునకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఐదు మండలాలకు లేవ్..​

జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట, లింగాల ఘన్​పూర్, తరిగొప్పుల, చిల్పూరు మండలాలకు 108 అంబులెన్స్​లు లేవు. దీంతో ఈ ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందిగా మారింది. జనగామలో ఉన్న అంబులెన్స్ వాహనం సైతం దాదాపుగా అవసాన దశకు చేరుకున్నాయి.

అయినా ఇదే వాహనంపై అదనపు భారం పడుతోంది. జనగామ జిల్లా కేంద్రం కావడం హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, సూర్యాపేటలకు వెళ్లే మార్గాల్లో హైవే పై నిత్యం యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. దీనికి తోడు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చే సీరియస్​ కేసులను ఇక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం లేదా హైదరాబాద్​కు రెఫర్ చేస్తుంటారు. మెరుగైన వైద్య సేవల కోసం పెద్దాస్పత్రులకు రెఫర్​ చేసినప్పుడు, పేషంట్ల తరలింపునకు అంబులెన్స్​లు అందుబాటులో ఉండడం లేదు. బాధితులు 108 కు కాల్​ చేస్తే వాహనాలు ఇతర ప్రాంతాల్లో బిజీగా ఉన్నాయని, కొద్ది సేపట్లో తిరిగి కాల్ చేసి అందుబాటులోకి తెస్తామనే సమాధానాలు వస్తున్నాయి. 

ఉన్నవాటి పై అధిక భారం..

జిల్లాలో 12 మండలాలుండగా, కేవలం 07 అంబులెన్స్​లతో సేవలందించడం ఇబ్బందిగా మారింది. కొరత కారణంగా అందుబాటులో ఉన్న వాటిపై తీవ్ర పని భారం పడుతోంది. గతంలో నర్మెట మండలానికి అంబులెన్స్ ఉండగా, ఆరేండ్ల క్రితం షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ మరో వాహనం అందుబాటులోకి రాలేదు. గతంలో జరిగిన మీటింగ్​ల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు పలుమర్లు మొత్తుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పేషంట్లకు సకాలంలో వాహనాలు రాక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు.

డెడ్​బాడీల తరలింపునకు వాహనం కరువు..

జనగామ జిల్లా ఆస్పత్రిగా మారినప్పటికీ మృతదేహాల తరలింపునకు ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. పోస్టుమార్టం తదుపరి మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాల్లో తరలించుకోవాల్సి వస్తోంది. ఇతర కొత్త జిల్లాల్లో గతంలోనే మృతదేహం తరలించేందుకు వాహనాలు మంజూరైనా, జనగామకు మాత్రం కాలేదు.

త్వరలో సర్కారు కొత్త అంబులెన్స్​లను మంజూరు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సారైనా మిగిలిన 5 మండలాలకు 108 అంబులెన్స్​లు, జిల్లా కేంద్రానికి డెడ్​బాడీలను తరలించేందుకు వాహనాన్ని మంజూరు చేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు.