ఫుట్​బాల్ మ్యాచ్​లో లొల్లి .. 100 మంది మృతి

 

  • ఆఫ్రికా దేశం గినియాలో ఘటన
  • మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయంతో మొదలైన గొడవ
  • వందలాది మంది దూసుకొచ్చిపరస్పరం దాడులు
  • తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులు

గినియా: ఆఫ్రికా దేశం గినియాలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్​ సందర్భంగా ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో పదుల సంఖ్యలో చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. జెరెకోర్ సిటీలో ఆదివారం నిర్వహించిన ఫుట్ బాల్ టోర్నమెంట్ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుందని గినియా ప్రధాని అమడౌ ఔరీబా ట్వీట్ చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

వీధుల్లోకి వచ్చి కొట్టుకున్నరు

గినియా మిలటరీ లీడర్ మామాడి డౌంబౌయా గౌరవార్థం ఆదివారం జెరెకోర్ సిటీలో ఫుట్​బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. లాబ్, జెరెకోర్ జట్లు మ్యాచ్ ఆడుతుండగా రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం అభిమానులకు కోపం తెప్పించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాదిమంది అభిమానులు గ్రౌండ్​లోకి దూసుకొచ్చారు. అదే సమయంలో వాళ్లను అడ్డుకునేందుకు మరో జట్టు అభిమానులు దూసుకొచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. గొడవను కంట్రోల్ చేసేందుకు సెక్యూరిటీ ఫోర్సెస్ టియర్ గ్యాస్​ను ప్రయోగించాయి. 

చాలామంది జనం స్టేడియం నుంచి బయటకు వెళ్లేందుకు పరుగులుపెట్టారు. కొందరు ఎత్తైన కంచె దూకి బయటపడ్డారు. అనంతరం వందలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారిలో కొందరి కండిషన్ సీరియస్​గా ఉందని డాక్టర్లు తెలిపారు. మొత్తం 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని స్థానిక మీడియా వెల్లడించగా, ప్రభుత్వం మాత్రం 56 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, ఈ టోర్నమెంట్ చట్టవిరుద్ధంగా నిర్వహించారని, విచారణ జరిపించాలని గినియా ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేసింది.