గణేశ్​ ఉత్సవాల్లో..100 కోట్ల టర్నోవర్​

  •     విగ్రహాల కొనుగోళ్లు సుమారు రూ.12 కోట్లు
  •     అన్నప్రసాదాల వితరణకు రూ.8 కోట్లు
  •     వేలాది మందికి ఉపాధి

నిజామాబాద్​, వెలుగు : హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ప్రత్యేకం.  ఈ గణేశ్​ ఉత్సవాల ద్వారా అందరికీ ఉపాధి లభించింది. విగ్రహాల ఏర్పాటు తో ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకలు నిమజ్జనం వరకు  ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజినెస్​ రూ.కోట్లలో జరిగింది. మార్కెట్లు అన్ని కొనుగోలు దారులతో కిటకిటలాడాయి.  ఉత్సవాల సందర్భంగా జరిగిన బిజినెస్​లో చిన్నాపెద్ద వ్యాపారులు లాభాలు ఆర్జించారు. ఏటా విగ్రహాల ఏర్పాటు పెరుగుతున్నకొద్ది లక్షల్లో జరిగే వ్యాపారం కోట్లలోకి చేరిందని పలువురు వ్యాపారులు తెలిపారు. మండప నిర్మాణం నుంచి నిమజ్జనం, ఊరేగింపు వరకు అన్ని వర్గాలకు ఉపాధి లభించడం ఈ పండుగ విశేషంగా చెప్పుకోవచ్చు. 

మార్కెట్లు కిటకిట

పోలీస్​ పర్మిషన్​లతో ప్రతిష్ఠించిన 5,700 గణపతి విగ్రహాల కొనుగోలుకు రూ.12  కోట్లు ఖర్చు చేశారు. మండపంలో  ప్రతిష్ఠించే  విగ్రహాన్ని రూ.5 వేలకు కొనుగోలు చేసినవారుండగా మరి కొందరు భారీ​ విగ్రహాల కోసం రూ.30 నుంచి రూ. 40 వేలు వెచ్చించారు. సుమారు 4.84 లక్షల ఇళ్లున్న జిల్లాలో 80 శాతం ఇండ్లలో బుల్లి గణపయ్యను కొలువుదీర్చడానికి స్తోమతను బట్టి ఒక కుటుంబం కనీసం రూ.150 ఖర్చు చేశారు.  దాని విలువ రూ.6 కోట్లు. కేవలం విగ్రహాల కొనుగోలుకు దాదాపు రూ.12 కోట్లు వెచ్చించినట్లు మార్కెట్​ వర్గాలు తెలిపాయి.  పువ్వులు, పూజ సామగ్రికి  ఇంటికి రూ.500 వెచ్చించారు.  ఇలా 4.2 లక్షల కుటుంబాల ఖర్చు రూ.20 కోట్లంటే వినేవారికి ఆశ్చర్యం కలుగక మానదు.

 మండపాల అలంకరణకు రూ.30 లక్షలు వెచ్చించారు.   ఒక మండపం నిర్మాణ ఖర్చు రూ.12 వేలు లెక్కించినా 5,700 మండపాలపై చేసిన వ్యయం సుమారు రూ.7 కోట్లు ఉంటుంది. ఉత్సవాలు ముగిసేదాకా సౌండ్​ సిస్టం ఏర్పాటు చేసినందుకు రూ.5 వేలు చార్జ్​ చేశారు.  లైట్ల ఏర్పాటు అదనపు ఖర్చు కలిపి రూ.4 కోట్లు వెచ్చించినట్లు మార్కెట్​ విశ్లేషకుల అంచనా.  తడికలు, వెదురు బొంగులు అమ్మే వారు మొదలుకొని టెంట్​ హౌస్​ నిర్వాహకులు, మండపాలు కట్టే కూలీలకు చవితి ఉపాధి దొరికింది.

శోభాయాత్రలో డప్పు వాయించే వారికి,   పూజారికి దక్షిణ సహా ఇతర ఖర్చులకు చేసిన వ్యయం  రూ.6 కోట్లకు చేరువలో ఉంది. వినాయక చవితి వేడుకలు నిర్వహించిన అన్ని  మండపాల్లో అన్నప్రసాద వితరణ చేశారు. భోజనం తయారీకి మొత్తం 5,700 మండపాల నిర్వాహకులు కనీసం రూ.12 వేలు  ఖర్చు చేసినా దాని విలువ  రూ.6.84 కోట్ల పైమాటే. దీంతో భోజనం తయారీ కార్మికులకు పరోక్షంగా ఉపాధి దొరికినట్లయ్యింది. రైస్​,  కిరాణా షాపులు, వెజిటెబుల్​ మార్కెట్లో గడిచిన 11 రోజుల టర్నోవర్​ రూ.15 కోట్లు ఉంటుంది.    

స్వీట్​ షాపులు కిటకిట

కనీసం 3 కేజీలకు తక్కువ గణపతి లడ్డూను ఏ మండపంలో కూడా పెట్టలేదు. కేజీ  లడ్డూ ధర​ రూ.400 గా తీసుకుంటే 3 కిలోల  లడ్డూ ధర రూ.1,200.  5,700 మండపాలలో స్వీట్​ వ్యయం  రూ.68 లక్షలు. వేలం పాటలో ఒక లడ్డూ రూ.10 వేలకు  పోయినా రూ.5.70 కోట్ల ఇన్​కం వచ్చింది. నిమజ్జనం కోసం వినియోగించిన సుమారు 1,500 వెహికల్స్​, డీజిల్​, బ్యాండ్​ తదితర  కలిపితే మొత్తం రూ.వంద కోట్ల బిజినెస్​ జరిగింది.