ఓపెన్​ చేసి వదిలేశారు .. వృథాగా అలంపూర్ హాస్పిటల్, గద్వాల ఇంటిగ్రేటెడ్​ మార్కెట్

గద్వాల, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా అప్పటి ప్రభుత్వం అలంపూర్ లో 100 బెడ్స్  హాస్పిటల్, గద్వాలలో ఇంటిగ్రేటెడ్  మార్కెట్  ఓపెన్  చేసింది. ఓపెన్​ చేసి ఏడాది దగ్గర పడుతున్నా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. సిబ్బందిని నియమించకుండా, సౌలతులు కల్పించకుండా ప్రజలను మభ్య పెట్టడానికి ఓపెన్  చేశారనే విమర్శలున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.21 కోట్లతో అలంపూర్​లో నిర్మించిన హాస్పిటల్ లో ఎలాంటి ఏర్పాట్లు లేకున్నా.. అప్పటి గవర్నమెంట్​ గత ఏడాది అక్టోబర్​ 5న ఓపెన్  చేసి చేతులు దులుపుకుందని అంటున్నారు. 

బిల్డింగ్​ను పట్టించుకునే వారు లేకపోవడంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్  పైప్ లైన్ లో ఉండే కాపర్ వైర్లు, ట్యాప్ లు, ఇతర సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక క్వాలిటీ లేకుండా హాస్పిటల్  నిర్మాణాన్ని చేపట్టడంతో వర్షాలకు లీకేజీ అవుతోంది. దొంగలు ఎత్తుకెళ్లిన పైప్ లైన్లు, ట్యాప్ లను ఏర్పాటు చేయడంతో పాటు సౌలతులు కల్పించి, లీకేజీలకు రిపేర్లు చేస్తే తప్ప హాస్పిటల్  ఓపెనింగ్  చేయలేని పరిస్థితి ఉంది. 

ఫైనాన్స్  క్లియరెన్స్  లేకుండానే..

అప్పటి బీఆర్ఎస్  సర్కార్  హాస్పిటల్ కు ఫైనాన్స్  క్లియరెన్స్  ఇవ్వకుండా, డాక్టర్లు, సిబ్బందిని పెంచకుండానే  ఓపెన్  చేశారనే విమర్శలున్నాయి. హాస్పిటల్ సిబ్బంది జీతభత్యాలు, రోజువారీ ఖర్చుల కోసం ఫైనాన్స్  క్లియరెన్స్  తప్పనిసరి. డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, టెక్నీషియన్లు, తదితర సిబ్బంది మొత్తాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టింది. 

ఫైనాన్స్  క్లియరెన్స్, సిబ్బందిని పెంచాక హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే గద్వాల హాస్పిటల్ లో ఉన్న సిబ్బందిని అలంపూర్ కు షిఫ్ట్  చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గద్వాలకు మెడికల్  కాలేజీ రావడంతో.. సిబ్బంది కొత్తగా రిక్రూట్​మెంట్​ చేస్తున్నారు. ఇప్పుడున్న హాస్పిటల్ ను మెడికల్  కాలేజీకి అనుబంధంగా నడపనున్నారు. ఇక్కడ పని చేసే సిబ్బందిని అలంపూర్​ షిఫ్ట్  చేసి అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి.

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​దీ అదే పరిస్థితి..

గద్వాలలో అప్పటి ప్రభుత్వం రూ.13.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మించింది. చికెన్, ఫిష్, మటన్, కిరాణం, వెజిటేబుల్  మార్కెట్  తదితర వాటి కోసం షెటర్లను ఏర్పాటు చేశారు. చికెన్, ఫిష్, మటన్ అమ్మకాల కోసం సపరేట్​గా షాపులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని గంటల్లో వస్తుందనగా, ఎమ్మెల్యే హడావుడిగా ప్రారంభించారు. ఇప్పటివరకు మార్కెట్​ను వినియోగంలోకి తీసుకొని రాకపోవడంతో ఆ బిల్డింగ్  వృథాగా దర్శనమిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది.

కోట్లు ఖర్చుపెట్టినా సమస్యలు తీరలే..

గద్వాలలోని కూరగాయల మార్కెట్ ఇరుకుగా ఉంది. ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందిగా ఉండడంతో ఇంటిగ్రేటెడ్  మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ అన్ని రకాల షాపులకు వెసులుబాటు ఉందని గొప్పలు చెప్పుకున్నారు. ఒకే చోట అన్నిరకాల వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని అప్పటి గవర్నమెంట్​ ప్రచారం చేసుకుంది. అయితే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ను నిరుపయోగంగా ఉంచడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సౌకర్యం, విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేసి వెంటనే అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

త్వరలోనే ఓపెన్ చేస్తాం..

అలంపూర్​100 బెడ్స్  హాస్పిటల్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని క్లియర్  చేస్తాం. ఫైనాన్స్, సిబ్బంది పెంచుకునేందుకు క్లియరెన్స్  రావాల్సి ఉంది. అనుమతి రాగానే హాస్పిటల్ లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం.

వినోద్, హాస్పిటల్ సూపరింటెండెంట్, గద్వాల