పది గ్రాముల పిట్ట పచ్చాకుల జిత్త.. రష్యా నుంచి చెన్నూరుకు వలసొచ్చిన బుజ్జి పక్షి

  • రోజూ 10 వేల పురుగులు తింటూ పర్యావరణానికి మేలు
  • చెన్నూరు అటవీ ప్రాంతంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ టీమ్ స్టడీ
  • 76 జాతుల పక్షులు, 22 రకాల సీతాకోక చిలుకలు గుర్తింపు

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: పచ్చాకుల జిత్త.. కేవలం పది గ్రాముల బరువుండే ఈ బుజ్జి పిట్ట ఖండాంతరాలు దాటి మన దగ్గరికొచ్చింది. ఇది చూస్తే బుల్లి పిట్టనే.. కానీ అడవులు, పర్యావరణానికి చేసే మేలు మాత్రం చాలా పెద్దది. ఇది​రోజుకు 14 గంటల పాటు చురుకుగా కదులుతూ దాదాపు 10 వేల పురుగులు, కీటకాలను తింటుంది. ఇలా పర్యావరణానికి  మేలు చేసే ఈ పచ్చాకుల జిత్త (గ్రీనిష్​వబ్లర్)ను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) రీసోర్స్​పర్సన్లు రాజశేఖర్, హర్ష, సోహాన్​మంచిర్యాల జిల్లా చెన్నూర్​ఫారెస్ట్​డివిజన్​లో గుర్తించారు. వీళ్లు గోదావరి పరీవాహక ప్రాంత అడవులు, శివ్వారం వైల్డ్​ లైఫ్, గొల్లవాగు, జోడువాగులు, అంబేద్కర్​అర్బన్​ఎకో పార్క్​ ఏరియాల్లో జీవవైవిధ్యంపై స్టడీ చేశారు. ఇక్కడ సుమారు 76 జాతుల పక్షులను గుర్తించగా.. అందులో 25 జాతులు విదేశాల నుంచి వచ్చాయని తెలిపారు. 

 యూరప్ లోనే సంతానోత్పత్తి.. 

పచ్చాకుల జిత్త.. ఆకుపచ్చ, పసుపు, బూడిద, తెలుపు రంగులు కలగలిసి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యూరప్​లో మాత్రమే సంతానోత్పత్తి చేసే ఈ జాతి పక్షులు చలికాలంలో రష్యా, మధ్య ఆసియా, హిమాలయ పర్వతశ్రేణుల నుంచి ఇండియాకు వలస వస్తాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ప్రతినిధులు తెలిపారు. చెట్లు ఎక్కువగా ఉండే ఆవాసాలు, అడవులు, నగరాలు, టౌన్లలోని పార్కులలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 8 నుంచి 10 గ్రాముల బరువు తూగే జిత్తలు.. రోజులో 10 నుంచి 14 గంటలు చురుకుగా కదులుతాయి. చెట్లలోని పురుగులు, ఇతర కీటకాలను తింటాయి. ఆకుల కింద దాగి ఉండే పురుగులను పట్టి తినడం వీటి ప్రత్యేకత. ఒక్క రోజులో హెక్టారు అటవీ విస్తీర్ణంలో ఎగురుతూ 8 నుంచి 10 వేల కీటకాలను తిని అడవులకు ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు వివరించారు. అడవుల్లో కీటక నివారణ చేస్తూ అక్కడి పర్యావరణ వ్యవస్థను కాపాడే ఈ పచ్చాకుల జిత్తలు... పెద్దపులులు, ఇతర పెద్ద జంతువులతో సమానంగా జీవవైవిధ్య సమతుల్యతను కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. 

ALSO READ : నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ గాంజా

22 వెరైటీల బటర్​ఫ్లైస్..

చెన్నూర్​ప్రాంతంలోని అడవులు, గోదావరి పరీవాహక ప్రాంతంలో 22 వెరైటీల సీతాకోక చిలుకలను డబ్ల్యూడబ్ల్యూఎఫ్​టీమ్​గుర్తించింది. వాటిలో 'కామన్ బ్యాండెడ్ పీకాక్' అరుదైనది. గ్రీన్, బ్లూ కలర్స్​లో నెమలిపింఛమంత ప్రకాశవంతంగా ఉండే ఈ జాతిని తెలంగాణ రాష్ట్ర బటర్​ఫ్లైగా పరిగణించే ప్రతిపాదన ఉన్నట్టు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడి సూక్ష్మ వాతావరణ పరిస్థితుల్లో అరుదైన మొక్కల జాతులు పెరగడం వల్ల వివిధ జాతుల సీతాకోక చిలుకలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయని వివరించారు. సాధారణంగా ఆయా దేశాల్లోని వాతావరణానికి అలవాటుపడిన పక్షులు, జంతువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అనుకూలించక తిరిగి వెళ్లిపోతాయని, కానీ చెన్నూర్​ఫారెస్ట్ అలాంటి వాటికి సైతం అనుకూలంగా ఉందన్నారు.