ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్‌షహర్ జిల్లాలో ఆగస్టు 18న టెంపోను ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా..మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. కొంత మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో టెంపోలో 25 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు పోలీసులు.
బుదౌన్ -మీరట్ రహదారిపై సేలంపూర్ ప్రాంతంలో ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ప్రైవేట్ బస్సు టెంపోను ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులంతా అలీగఢ్ జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.