వరంగల్​లో రూ.10 కోట్ల బంగారం చోరీ!

  • ఎస్​బీఐ లాకర్​ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు
  • గ్యాస్ ​కట్టర్​తో కిటికీని కట్​చేసి లోనికి..
  • అలారం సిస్టమ్​ డ్యామేజ్.. సీసీ టీవీ ఫుటేజీ అపహరణ
  • విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి

రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఎస్‌బీఐ బ్యాంకులోని లాకర్‌లో ఉంచిన రూ.10 కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైంది. గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకు కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు.. లాకర్‌లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగింది. లాకర్లలో భద్రపరిచిన సుమారు 15 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి బ్యాంక్​ వెనకాల ఉన్న కిటికీని తొలగించి, దొంగలు లోపలికి చొరబడ్డారు. మొదట అలారం సిస్టమ్​ను డ్యామేజ్​ చేశారు. సీసీ టీవీ ఫుటేజీని దొంగిలించారు. అనంతరం లాకర్స్​ రూంలోకి వెళ్లి బంగారం ఉన్న లాకర్​ను కట్​ చేశారు. అందులో ఉన్న మొత్తం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు సిబ్బంది యధావిధిగా బ్యాంకుకు వెళ్లారు. అయితే బ్యాంకు షెట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, ఫైల్స్ చిందర వందరగా పడి ఉన్నాయి. 

బ్యాంకు సిబ్బంది ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగింది. ఎంత మొత్తంలో బంగారం పోయిందనే వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. సుమారు 15 కిలోల వరకు బంగారం పోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఖాతాదారుల ఆందోళన

దొంగతనం విషయం తెలియగానే లాకర్​లో బంగారం దాచుకున్న ఖాతాదారులు బ్యాంక్​ వద్దకు చేరుకున్నారు. బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. తాము ఇష్టం కొద్ది చేయించుకున్న బంగారు నగలు పోయాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకు ఊరి శివారులో ఉన్నదని, ఇక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం వల్లే దొంగతనం జరిగిందని అన్నారు.  గత నాలుగేండ్ల కిందట ఇదే బ్యాంక్​లో దొంగలు పడ్డారని, అప్పటి నుంచైనా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటే ఇలాంటి ఘటన పునరావృతం అయ్యేది కాదని పేర్కొంటున్నారు. దీనిపై విచారణకు వచ్చిన ఎస్​బీఐ ఆర్ఎం అబ్దుల్​ రహీంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. 

ఎలాంటి విషయాలు ఇప్పుడే చెప్పబోమని అన్నారు.  ఖాతాదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు.  వారికి ఎలాంటి నష్టం జరగకుండా బంగారానికి సమానమైన డబ్బులు అందజేస్తామని తెలిపారు.  వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్​ఐ శ్రవణ్​​కుమార్,​ తదితరులు విచారణ చేపట్టారు. దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే వారిని  పట్టుకుంటామని తెలిపారు.