ఇందూర్​లో బాలుడు కిడ్నాప్

  • తల్లి పక్కన పడుకున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ముగ్గురు మహిళలు

నిజామాబాద్,  వెలుగు : ఇందూర్​ పట్టణంలోని జీజీహెచ్​ గ్రౌండ్​లో ఏడాది వయసు ఉన్న బాలుడు శనివారం కిడ్నాప్​నకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండల కేంద్రానికి చెందిన రాజు నిజామాబాద్​ బస్టాండ్​ క్యాంటీన్​లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య లక్ష్మి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హాస్పిటల్​లో వైద్య పరీక్షలు చేయిస్తానని భర్త చెప్పాడు. దీంతో ఆరేండ్ల లోపు ఉన్న ముగ్గురు పిల్లలను తీసుకొని శుక్రవారం సాయంత్రం బస్సులో నిజామాబాద్​ వచ్చింది.

ఉదయం హాస్పిటల్​కు వెళ్దామని నిర్ణయించుకొని భోజనం చేసి రాత్రి జీజీహెచ్​ పార్కింగ్​ ఏరియాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసే సరికి ఏడాది వయసు ఉన్న మణికంఠ కనిపించలేదు. పరిసరాల్లో వెతికినా కనిపించకపోవడంతో వన్​టౌన్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో ముగ్గురు మహిళలు బాబును ఎత్తుకెళ్తున్నట్లు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.