- గాసానికి పక్క జిల్లాలే ఆధారం
- స్టూడెంట్స్ కోసం ఏటా 5,400 టన్నుల బియ్యం కావాలే
- ఈ సీజన్లో కొనుగోలు చేసింది 3 వేల టన్నులే
- ఈ బియ్యం 5 నెలలకే సరి
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు తక్కువగానే వచ్చాయి. స్టూడెంట్స్‌కు నాణ్యమైన ఆహారం అందించాలన్నదే సర్కారు లక్ష్యం. ఇందుకోసం కచ్చితంగా సన్న బియ్యం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అవసరమైన స్థాయిలో యాదాద్రి జిల్లాలో సన్నరకాలు అందుబాటులో లేకపోవడంతో ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైన బియ్యం కోసం ఇండెంట్ పెట్టినా సమయానికి అందుబాటులోకి రావడం లేదు.
నెలకు 450 టన్నులు అవసరం..
యాదాద్రి జిల్లాలోని వివిధ వెల్ఫేర్డిపార్ట్మెంట్లపరిధిలో రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, కేజీబీవీ కలిపి 97 ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిలో22,820 మంది స్టూడెంట్స్ఉన్నారు. ప్రతి స్టూడెంట్‌కు భోజనం కోసం నెలకు 15 కిలోల చొప్పున 348 టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. 587 అంగన్వాడీ సెంటర్లలో చిన్నారుల కోసం 37 టన్నుల బియ్యం, మధ్యాహ్న భోజనం స్కీంలో 689 స్కూల్స్‌లోని స్టూడెంట్స్ కోసం 65 టన్నుల బియ్యం కావాలి.
మొత్తంగా ప్రతి నెలా 450 టన్నుల బియ్యం అవసరమైతే ప్రస్తుతం జిల్లాలో 200 టన్నుల సన్న బియ్యం మాత్రమే అందుబాటులో ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఈ బియ్యం ఒక్క నెలకు కూడా సరిపోవు. దీంతో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 350 టన్నుల బియ్యం కావాలని ఇండెంట్ పెట్టారు. అయితే రెండు రోజుల క్రితం 60 టన్నుల బియ్యం మాత్రమే వచ్చింది.
కొన్నది మూడు వేల టన్నులే..
యాదాద్రి జిల్లాలో 2024 వానాకాలం సీజన్లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సన్న వడ్లు కేవలం 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. 75 వేల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో రైతుల అవసరాలు పోను 30 వేల టన్నులు సెంటర్లకు వస్తాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా సెంటర్లకు పెద్దగా సన్న వడ్లు రాలేదు. రైతులు ఎక్కువ మొత్తంలో వడ్లను మరాడించి నిల్వ చేసుకున్నారు. కాగా వడ్ల కొనుగోలు చివరి దశకు వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 3 వేల టన్నుల సన్న రకాలను మాత్రమే సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.
గాసం కోసం ఇతర జిల్లాలపైనే..
కొనుగోలు చేసిన 3 వేల టన్నుల వడ్లను సీఎంఆర్కోసం జిల్లాలోని 7 మిల్లులకు అందించారు. ఈ వడ్లను మరాడిస్తే సుమారు రెండు వేల టన్నుల బియ్యం అందుబాటులోకి వస్తాయి. ఈ బియ్యం జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ, హాస్టల్స్, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పిల్లల భోజనం కోసం ఐదు నెలలపాటు ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మిగిలిన ఏడు నెలల పిల్లల గాసం కోసం అవసరమైన 3,150 టన్నుల కోసం ఇతర జిల్లాలపైనే ఆధారపడాల్సి వస్తుంది.