అవాక్కయ్యారా : జిరాక్స్ అనేది కంపెనీ పేరా.. మరి ఆ ప్రింట్ ను ఏమంటారు..?

ఏ ఆఫీసుకి పోయినా, 'జిరాక్స్లు పట్టుకొచ్చినవా?' అనే మాట వినిపిస్తది. చాలా చిన్నప్పుడే.. పుస్తకాలు, కాగితాలతోటి పనిబడ్డప్పట్నుంచే జిరాక్స్ మన జీవితాలలకు వచ్చేస్తది. జిరాక్స్ అంటే ఏంది? మనమిచ్చిన పేపర్ మీద ఉన్న  అక్షరాలే ఇంకో పేపర్ మీద అచ్చయి రావాలి. దీన్నే కదా జిరాక్స్ అంటున్నం. జిరాక్స్ పేరు మీదనే షాపులు కూడా ఉన్నయి. అయితే దీన్ని జిరాక్స్ అనొద్దు. దీనికి  ఇంకో పేరుంది. ఇవే కాదు.. ఫొటోషాప్, ధర్మాస్, గూగుల్ జీప్, బ్యాండెయిడ్.. ఇట్ల మనం వాడుతున్న చాలా మాటలకు వేరే పదాలున్నయి. మనం మాట్లాడుతున్నవి. కంపెనీ పేర్లు. ఆ సంగతేందో తెలుసుకోండి.

కొత్త మాటలు ఎవరు కనిపెడతారు?

మనమిచ్చిన పేపర్ మీద ఉన్న అక్షరాలే ఇంకో పేపర్ మీద అచ్చయి రావాలంటే ఒక మెషిన్ కావాలి. ఆ మెషిన్ లేనప్పుడు ఈ పని జరగలేదు కాబట్టి ఇప్పుడు దీనికో పేరు కావాలి. 'జిరాక్స్' అనే కంపెనీ మొదట ఈ మెషిన్లను తయారుచేసింది. ఆ కంపెనీ పేరు మీదనే అందరూ జిరాక్స్ అనే మాటను పుట్టించి అలవాటు చేసుకున్నారు. తర్వాత వేరే కంపెనీలు కూడా ఈ మెషిన్లను తయారుచేసినా ఇప్పటికీ జిరాక్స్ అనే అంటున్నాం.మన షాపులపై కూడా జిరాక్స్ అనే ఉంటుంది. మనం వెళ్లి అడిగినా, 'జిరాక్స్ తీస్తరా?' అనే అడుగుతాం. మరి జిరాక్స్ కాకుంటే దీని పేరేంటి? ఏమని పిలవాలి? 'ఫొటోకాపీ' వాడాల్సిన అసలు పదం. జిరాక్స్ అన్నది కంపెనీ పేరు. అంటే నామవాచకం. దాన్ని మనం క్రియా పదంగా వాడుతున్నాం. జిరాక్స్ మెషీన్ కూడా ఫొటోకాపీయర్, జిరాక్స్ మెషిన్ కాదు. ఏళ్లుగా మన జీవితాల్లో అది జిరాక్స్ ముద్ర పడి ఉంటే ఫొటోకాపీ అని ఎలా అంటామంటారా? అంతే!

గూగుల్ చెయ్.. ఫొటోషాప్ చెయ్..

ఏదన్నా కొత్త విషయం తెలుసుకోవాలనుకున్నా, ఏదన్నా మరిచిపోయిన విషయం కనుక్కోవాలన్నా 'గూగుల్ చెయ్' అంటారు. గూగుల్ చెయ్యడం అంటే ఏంటి? ఇంటర్నెట్లో వెతకడం అని. గూగుల్ అన్నది ఒక సెర్చ్ ఇంజన్ మాత్రమే. అంటే ఇంటర్నెట్లో మనకున్న వెబ్ సైట్లను వెతికి చూపించేది. గూగుల్ ఒక్కటే కాదు, బింగో, యాహూ లాంటి ఎన్నో సెర్చ్ ఇంజన్లు ఉన్నాయని తెలుసు కదా! అయినా 'గూగుల్ చెయ్' అంటే ఇంటర్ నెట్లో వెతికెయ్ అనే అర్థం ఎందుకొచ్చిందంటే, దానికున్న బ్రాండ్ వల్ల. ఇలాగే కేవలం కంపెనీ బ్రాండ్ పాపులర్ అయిన మాట ఇంకొకటి ఉంది. అదే 'ఫొటోషాప్ చెయ్' ఫొటోషాప్ అన్నది అడోబ్ కంపెనీ నుంచి వచ్చిన ఒక సాఫ్ట్వేర్. దీంతో ఫొటోలు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎంతలా పాపులర్ అయిందంటే, ఫొటోలు ఎడిట్ చెయి అనడానికి బదులు, 'ఫొటోషాప్ చెయ్' అనేంతగా.