తిరుపతిలో లడ్డూ.. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం.. వారణాశిలో భోజనం.. ఇలా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంది. అయోధ్య రామ మందిరంలో వితరణ చేయబోతున్న ప్రసాదం ప్రాముఖ్యత మీకు తెలుసా?
తిరుపతిలో లడ్డూ.. శబరిమలలో అరవాన్నం.. షిరిడీలో నువ్వులతో చేసిన ప్రత్యేక ఆహారాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దేశంలో ప్రతీ ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తులకు ప్రసాదాలు అందిస్తుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన భక్తులు తమ శక్తి మేరకు ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. ఇళ్లకు తీసుకువెళ్తారు. తాము ఫలానా క్షేత్రానికి వెళ్లొచ్చామని బంధువులు, స్నేహితులకు ప్రసాదం అందిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.
ఇక భక్తులు కూడా కొన్ని ప్రసాదాలను చూడగానే అది ఏక్షేత్రంలో ఇచ్చారు గుర్తుపడతారు. మరికొన్ని ప్రసాదాలను రుచి చూసి చెప్పేస్తారు. దక్షిణ భారత దేశంలోని పుణ్యక్షేత్రాల్లో చాలా వరకూ లడ్డూ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఉత్తర భారత దేశంలో వేర్వేలు పదార్థాలతో చేసిన ప్రసాదాలు పంపిణీ చేస్తారు. అన్ని ప్రసాదాల కన్నా.. తిరుపతి లడ్డూను భక్తులు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఇప్పుడు అయోధ్యలో కూడా ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులకు అందించబోతున్నారు.
అయోధ్య ప్రసాదం ప్రత్యేకం..
శ్రీరాముడు నడయాడిన నేల అయోధ్యలో జనవరి 22న భవ్య రామమందిరం ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ప్రతిష్టించబోయే రాముని విగ్రహం నుంచి అన్నీ ప్రత్యేకమే. ఆలయ నిర్మాణం ఒక ప్రత్యేకం, గంటలు మరింత ప్రత్యేకం, తలుపులు ఇంకా ప్రత్యేకం.. ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్యలో అన్నీ ప్రత్యేకమే. ఇక్కడ పంపిణీ చేయబోయే ప్రసాదం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట తర్వాత భక్తులకు అందించే ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉండాలని రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ భావించింది. ‘ఇలాచీ దానా’ను ప్రసాదంగా ఇవ్వబోతున్నారు.
ఎలా తయారు చేస్తారంటే..
అయోధ్యలో భక్తులకు పంపిణీ చేసే ఇలాచీ దానా ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందుకు యాలకులు, చక్కెర మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా దీనిని ఉత్తర భారతదేశంలోని చాలా ఆలయాల్లో ఇస్తుంటారు. రామ మందిర ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు కూడా ఇలాచీ దానాను ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని తయారు చేయడానికి రామ్ విలాస్ అండ్ సన్స్‌కు ఇప్పటికే భారీ ఆర్డర్ ఇచ్చారట. ఈమేరకు ఇలాచీ దానా తయారు చేసే పనిలో సంస్థ నిమగ్నమైంది.
ఆరోగ్య దాయం..
ఈ ఇలాచీ దానా ఆరోగ్యానికి ఎంతో మంచిది. యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ముఖ్యంగా కడుపుకి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇలాచీ దానాను ప్రసాదంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇలాచీ దానా దేశంలో ప్రత్యేకతను సంతరించుకోబోతోంది.
ఇలాచి దానా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇలాచి దానాలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాయి. ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు మా దగ్గర ఇలాచి దానా ప్రసాదాన్ని కొనడానికి వస్తారు. పూర్వాంచల్ ప్రాంతం నుంచి వచ్చి కూడా ప్రసాదం కొనుగోలు చేస్తారు.' అని రామ్ విలాస్ అండ్ సన్స్ షాపు యజమాని బోల్ చంద్ర గుప్తా తెలిపారు.జనవరి 22లోపు 5 లక్షల ఇలాచి దానా ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్ట్‌కు అందించేందుకు రామ్ విలాస్ అండ్ సన్స్ సిబ్బంది కృషి చేస్తున్నారు.
ప్రతీ క్షేత్రంలో ప్రసాదాలు..
భారత దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. వాటికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. భక్తులు ఇష్టంగా స్వీకరిస్తారు. కొనుగోలు చేస్తారు. అలాంటి వాటిలో ముందుగా చెపుపకోవాల్సింది తిరుపతి లడ్డూ. తిరుపతి లడ్డూ ప్రత్యేకత అందరికీ తెలుసు. దీనిని తయారు చేయడానికి 1,100 మంది పనివాళ్లు నిత్యం పనిచేస్తారు. సౌరశక్తితో నడిచే వంటశాలలో లడ్డూ తయారీకి అవసరమైన వంటకాలు తయారు చేస్తారు. ఇక్కడ లడ్డూ ప్రసాదం రుచి మరెక్కడా ఉండదు. ఇక అన్నవరం సత్యనారాయణ స్వామి నివేదన కోసం చేసే ప్రసాదం కూడా ప్రత్యేకం. గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడితో దానిని తయారు చేస్తారు. ఏడాదికి 1.50 కోట్ల ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. షిరిడీ సాయునాథుని పుణ్యక్షేత్రంలో దూద్‌పేడాను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ ఆలయాల్లో మఖన్ మిశ్రీ, వైష్ణోదేవి ఆలయంలో డ్రై ఫ్రూట్స్, వారణాసి అన్నపూర్ణదేవి ఆలయంలో భోజనం, గురువ్వారాలో కడ ప్రసాదం దేవుళ్లకు నివేదించి భక్తులకు పంపిణీ చేస్తారు.