మా టీచర్లు మాకే కావాలి..కేజీబీవీల్లో విద్యార్థినుల నిరసన

  • కల్లూరు, ఉప్పమడుగు కేజీబీవీల్లో విద్యార్థినుల నిరసన

కోరుట్ల, వెలుగు:  జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు, రాయికల్ మండలం ఉప్పుమడుగులోని కేజీబీవీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు మా టీచర్లు మాకే కావాలని శనివారం ఆందోళనకు దిగారు.  సమగ్ర శిక్షా ఉద్యోగులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో శనివారం కోరుట్ల ఎంఈఓ నరేశం 8 మంది టీచర్లను తీసుకుని కల్లూరు  కేజీబీవీకి వెళ్లారు.  

విద్యార్థినులు మాత్రం గేటు లోపలకు తాళం వేసుకుని కొత్త వారు వద్దని మా టీచర్లు మాకే కావాలని పట్టుబట్టారు.  ఉప్పుమడుగులో జిల్లా విద్యాధికారి రాము పంపిన టీచర్లు వద్దంటూ నిరసన తెలుపుతూ విద్యార్థులు గేటు బయటే బైఠాయించారు.  దీంతో కేజీబీవీ టీచర్ల సమస్య ప్రభుత్వం పరిశీలిస్తుందని విద్యార్థినులకు ఉన్నతాధికారులు నచ్చజెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ఆందోళన విరమించారు.