పోచారం వర్సెస్​ ఏనుగు రవీందర్​రెడ్డి... బాన్సువాడ కాంగ్రెస్​లో కుదరని సయోధ్య

  • బాన్సువాడ  కాంగ్రెస్​లో కుదరని సయోధ్య
  • ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం
  • నియోజకవర్గంలో ఉండొద్దని ఆధిష్టానం చెప్పిందన్న పోచారం
  • నేనేందుకు వెళ్లాలన్న రవీందర్​రెడ్డి

కామారెడ్డి​​​ ​, వెలుగు : బాన్సువాడ నియోజక వర్గంలోని  కాంగ్రెస్​ ముఖ్య నేతల మధ్య ఇటీవల మాటల యుద్దం కొనసాగుతోంది.  ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదరలేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి బరిలో దిగారు.   పోచారం శ్రీనివాస్​రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసి గెలుపొందారు.   

రాష్ర్టంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావటంతో పరిస్థితులు తారుమారయ్యాయి.   ఎన్నికల్లో  ఓడిన  ఏనుగు రవీందర్​రెడ్డిని నియోజక వర్గ ఇన్​చార్జిగా పార్టీ నియమించింది.  కాగా, బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్​రెడ్డి ఒక పర్యాయం మంత్రిగా, మరో ఐదేండ్లు స్పీకర్​గా పని చేశారు. బాన్సువాడలో మళ్లీ ఈయన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ  రాష్ర్టంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి  వచ్చింది.  నియోజక వర్గంలో ఏనుగు రవీందర్​రెడ్డి చెప్పిందే వేదంగా మారింది.  ఎన్నో ఏండ్లుగా నియోజక వర్గాన్ని శాసించిన పోచారానికి ఇది మింగుడు పడలేదు.  అధికారులు మాజీ ఎమ్మెల్యే మాటకే విలువ ఇస్తున్నారు.

  గతంలో ఇక్కడ పని చేసిన ఆఫీసర్లను బదిలీ చేయించారు. పలువురు పోలీస్​ ఆఫీసర్లకు రవీందర్​రెడ్డి పోస్టింగ్​లు కూడా ఇప్పించారు.  పోచారం శ్రీనివాస్​రెడ్డి కొద్ది నెలల తర్వాత కాంగ్రెస్​ పార్టీలో చేరారు.   పోచారం కాంగ్రెస్​ కండువా కప్పుకోవటంతో  నియోజక వర్గంలో   కాంగ్రెస్​లో రెండు వర్గాలు ఏర్పాడ్డాయి. కొందరు ఏనుగు రవీందర్​రెడ్డి వెంట ఉండగా, మరి కొందరు  పోచారం శ్రీనివాస్​రెడ్డి వెంట ఉన్నారు. 

వేర్వేరుగా తిరుగుతూ

పోచారం శ్రీనివాస్​రెడ్డి, ఏనుగు రవీంధర్​రెడ్డి  నియోజక వర్గంలో వేర్వేరుగా  తిరుగుతున్నారు.  ఒకరు వెళ్లే పోగ్రాంకు మరో నేత క్యాడర్​ వెళ్లడం లేదు.  నామినేటేడ్​ పోస్టుల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యే మాటే ఎక్కువగా చెల్లు బాటు అయ్యింది.   అసెంబ్లీ ఎన్నికల తర్వాత  నియోజక వర్గంలో పోస్టింగ్​లు పొందిన ఇద్దరు పోలీసు ఆఫీసర్లను ఇటీవల మార్చారు. బాన్సువాడ టౌన్​, రూరల్​ సీఐలను మార్చి కొత్త వారికి పోస్టింగ్​లు ఇచ్చారు.  ఇది కూడా అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య  విభేదాలకు కారణమైంది.   

తాజాగా ఒకరిపై ఒకరు

పోచారం శ్రీనివాస్​రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు తాజాగా  బహిరంగ విమర్శలతో నియోజకర్గ రాజకీయాలు హీటెక్కాయి. ఇటీవల వర్ని మార్కెట్​ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార పోగ్రాంలో  ఏనుగు రవీందర్​రెడ్డి పై పోచారం శ్రీనివాస్​రెడ్డి విమర్శలు చేశారు.  ఓడిన వ్యక్తి నియోజక వర్గ రాజకీయాల్లో కలుగజేసుకోవద్దని పార్టీ పెద్దలు సూచించారంటూ మాట్లాడారు. దీనిపై ఏనుగు రవీందర్​రెడ్డి ఘాటుగానే స్పందించారు. తాను ఎందుకు నియోజక వర్గాన్ని వదిలి పెట్టి వెళ్లాలని,  40 ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.