కార్పొరేషన్ వద్దు - పల్లెలే ముద్దు అంటూ ర్యాలీ

సుజాతనగర్, వెలుగు :  సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం  చేయడాన్ని  వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో 7 గ్రామ పంచాయతీల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో  సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ సుజాతనగర్ మండలం ఇంకా వెనుకబడి ఉందని,  5000 మంది వ్యవసాయ కూలీలు ఈ 7 గ్రామపంచాయతీలలో ఉన్నారని,  వ్యవసాయ కూలీలకు  గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దవుతుందని అన్నారు. 

విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు   పోరాటం కొనసాగిస్తామని, అందులో భాగంగానే ఈనెల 20న  కలెక్టరేట్ వద్ద 2వేల మందితో ధర్నా  చేస్తామని తెలిపారు.   ర్యాలీ అనంతరం తహసీల్దార్ శిరీష,  ఎంపీడీఓ భారతికి   వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో  సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మా,  సుజాతనగర్ మండల కార్యదర్శి వీర్ల రమేశ్​, బచ్చలకూర శ్రీనివాస్, కొండె కృష్ణ, నల్లగొపు పుల్లయ్య, మద్దెల శ్రీలక్ష్మి, సోలం నాగరత్నమ్మ పాల్గొన్నారు.