సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

  • మంత్రి ఉత్తమ్ కుమార్ తోప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భేటీ 

వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​తో రాష్ర్ట ప్రభుత్వ విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ సమీక్ష నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతి పై అధికారులతో చర్చించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ టూ ఫేస్ వన్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా మర్రిపల్లి రిజర్వాయర్, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ పనుల్లో వేగవంతం చేయాలని సూచించారు.  ఇటీవల బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ. 325 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. లచ్చంపేట చెరువును రిజర్వాయర్ గా మార్చే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. 

కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి ఎడమ కాల్వలకు సంబంధించి భూ సేకరణ వెంటనే చేపట్టి కాలువ పనులను ప్రారంభించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎగువ మానేరు ప్యాకేజ్ 9 పనుల్లో వేగవంతం చేయాలని, సరిపడా నీటిని నింపాలని పేర్కొన్నారు.  పనుల్లో పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. త్వరలోనే  వేములవాడ నియోజకవర్గం లోని పలు ప్రాజెక్టులను సందర్శిస్తానని మంత్రి తెలిపారు.