ఇండ్ల సర్వే తప్పుల్లేకుండా ఉండాలి : వీపీ గౌతమ్

  • వరంగల్ లో క్షేత్ర స్థాయిలో సర్వే పరిశీలన 

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: ఇందిరమ్మ స్కీమ్ ఇండ్ల సర్వే తప్పులు లేకుండా పక్కగా నమోదు చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ గౌతమ్ సూచించారు.  వరంగల్ బల్దియా పరిధి 29 డివిజన్ రామన్నపేటలో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి సర్వే తీరును పరిశీలించారు. సర్వే చేసే క్రమంలో  లబ్ధిదారులు వివరాలను ఎలాంటి తప్పుల్లేకుండా నమోదు చేసేలా చూడాలని చెప్పారు.  యాప్ లో వివరాల నమోదు తీరును అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. 

అనంతరం హనుమకొండ ఐడీవోసీలో సర్వేపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బల్దియా పరిధిలో పూర్తయిన సర్వే వివరాలను అడిగి తెలుసుకోగా..  90 శాతం కంప్లీట్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్లు తెలిపారు. మిగతా సర్వేను స్పీడ్ గా పూర్తి చేయాలని సూచించారు. వార్డు నంబర్లు తప్పుగా నమోదైనట్టు గుర్తించామని, సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరగా.. త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎండీ తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర హౌసింగ్ సీఈ  చైతన్య కుమార్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, రవీందర్, ఆర్ఐ విజయ్ కుమార్ ఉన్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌