- యూఎస్ ఐసీఈ 2024 వార్షిక నివేదిక వెల్లడి
- 2021తో పోలిస్తే 400% పెరుగుదల
- ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులే కారణమని క్లారిటీ
వాషింగ్టన్: అమెరికా ప్రతి ఆరు గంటలకో ఇండియన్‌ను వెనక్కి పంపుతున్నది. 2021తో పోలిస్తే అమెరికా నుంచి తిరిగి వెనక్కి పంపబడిన భారతీయుల సంఖ్య 400% పెరిగింది.2024కు సంబంధించి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) డిసెంబర్ 19న వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ప్రతి ఆరు గంటలకో ఇండియన్‌ను తమ స్వదేశానికి పంపుతున్నట్లు తేలింది. 2021లో అమెరికా తమ దేశం నుంచి మొత్తం 59,011 మందిని వారి స్వదేశానికి పంపించి వేసింది.
అందులో 292 మంది ఇండియన్స్ ఉన్నారు. 2022లో 72,177 మందిని వెనక్కి పంపగా అందులో 276 మంది భారతీయులు ఉన్నారు. 2023లో మొత్తం 1,42,580 మందిని వెనక్కి పంపగా..అందులో 370 మంది భారతీయులే. ఇక ఈ ఏడాది అమెరికా మొత్తం 2,71,484 మందిని వారి స్వదేశానికి పంపింది. అందులో 1,529 మంది ఇండియన్స్ ఉన్నారు. అంటే 2021తో పోలిస్తే 2024లో అమెరికా తమ దేశం నుంచి ఇండియన్లను స్వదేశానికి పంపినవారి సంఖ్య 400% పెరిగింది .
విధానాల్లో మార్పులే కారణం
ఇండియన్‌లను అమెరికా వెనక్కి పంపుతుండటంపై ఇండియన్ సెంట్రల్ ఏజెన్సీకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ..‘‘యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు చేసి కఠినంగా అమలు చేస్తున్నారు. అందుకే ఇండియన్‌లను వెనక్కి పంపుతున్నవారి సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దానికి తోడు యూఎస్, ఇండియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి అనేక కారణాలు కూడా సంఖ్యను ప్రభావితం చేస్తాయి.
ఈ ఏడాది సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్రమ వలసలపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవడమే ప్రధాన కారణం’’ అని వివరించారు. అయితే, 2024 నివేదిక విడుదలయ్యే సమయానికి అమెరికా నుంచి వెనక్కి పంపిన ఇండియన్ల సంఖ్య 3,467కి చేరుకుంది. సరైన డాక్యుమెంట్స్ లేని సుమారు 18 వేల మంది భారతీయులను గుర్తించింది. వీరందరిని కూడా అమెరికా వెనక్కి పంపే అవకాశం ఉంది.