ఖైరతాబాద్​ పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఖైరతాబాద్‌ బడా గణేశ్​పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం నుంచి ఈ నెల 17న నిమజ్జనాలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కొన్ని రోడ్లను పూర్తిగా క్లోజ్​చేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్‌ విశ్వప్రసాద్‌ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత వాహనాలపై దర్శనానికి వచ్చే భక్తులు నెక్లెస్ రోడ్, ఐమాక్స్‌ రోటరీ వైపు నుంచి మాత్రమే రావాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్​గార్డెన్​పక్కన ఉన్న 125 అడుగుల అంబేద్కర్​విగ్రహం పక్కన పార్కింగ్​సౌకర్యం కల్పించారు. ఖైరతాబాద్‌, రాజీవ్‌ గాంధీ స్టాచ్యూ రోడ్‌, రాజ్‌దూత్‌ లేన్‌ రూట్లలో అనుమతి లేదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సహాయం కోసం 90102 03626కు కాల్ చేయొచ్చని సూచించారు.

దర్శనానికి మూడు దారులు

ఖైరతాబాద్, వెలుగు: ఖైరతాబాద్​మహా గణపతి దర్శనం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. శనివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్​రెడ్డి తొలిపూజ చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.  

ఇలా వెళ్లాలి.. అలా రావాలి

– ఖైరతాబాద్​ రైల్వే గేటు నుంచి వచ్చేవారు నేరుగా ఎడమ వైపు బారికేడ్ల నుంచి వెళ్లి వినాయకుడిని దర్శించుకుని ఐమాక్స్​ థియేటర్ లేదా మింట్​కాంపౌండ్​ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 
– -మింట్​కాంపౌండ్ ​నుంచి వచ్చేవారు ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం, గజ్జలమ్మ దేవాలయం, వార్డు ఆఫీస్, ప్రభుత్వ దవాఖాన ముందు నుంచి లైన్​లో వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మింట్​కాంపౌండ్ వైపే వెళ్లాల్సి ఉంటుంది.  
– లక్డీకాపూల్, సెన్సేషన్​ థియేటర్ వైపు నుంచి వచ్చేవారు రాంరెడ్డి చికెన్​సెంటర్ మీదుగా వచ్చి కార్నర్​నుంచి దర్శించుకుని ఎడమవైపు ఉన్న కాంగ్రెస్​ పార్టీ ఆఫీసు వైపు బయటకు రావాలి.      

మూడు షిఫ్టుల్లో డ్యూటీలు  

భక్తుల భద్రత కోసం 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు, -13 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది ఎస్సైలు, 22 ప్లాటూన్ల సిబ్బంది 3 షిఫ్టుల్లో డ్యూటీలు చేయనున్నారు. 40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగించనున్నారు.

ట్రాఫిక్‌  డైవర్షన్స్ ఉండే ప్రాంతాలు

  •  ఖైరతాబాద్ ​ఫ్లైఓవర్ నుంచి ఐమ్యాక్స్​పార్కింగ్​వరకు వెళ్లొచ్చు. మింట్​కాంపౌండ్​వైపు వాహనాలకు అనుమతి లేదు. 
  •  ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్‌ మీదుగా మింట్‌ కాంపౌండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వెహికల్స్​ను రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరంకారీ జంక్షన్ వైపు నుంచి మళ్లిస్తారు.
  •  ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రాజ్‌దూత్‌ లేన్‌లో బడా గణేశ్​వైపు నో ఎంట్రీ. ఇక్బాల్ మినార్‌‌ మీదుగా వాహనాలను డైవర్ట్‌ చేస్తారు.
  •  ఇక్బాల్ మినార్‌‌ నుంచి మింట్ కాంపౌండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. మింట్‌ కాంపౌండ్ ఎంట్రన్స్ వద్ద తెలుగుతల్లి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
  •  ఎన్‌టీఆర్‌‌ మార్గ్‌, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌‌, నెక్లెస్ రోడ్స్‌ నుంచి మింట్ కంపౌండ్‌ వైపు నో ఎంట్రీ, నెక్లెస్ రోటరీ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌‌, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌‌ వైపు దారి మళ్లిస్తారు.
  •  నిరంకారీ  ఖైరతాబాద్ పోస్ట్‌ ఆఫీస్‌ లేన్‌ మీదుగా ఖైరతాబాద్‌ రైల్వే గేట్‌ వైపు నో ఎంట్రీ. వాహనాలను ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ జంక్షన్‌ మీదుగా డైవర్ట్ చేస్తారు.

వాహనాలకు పార్కింగ్‌ : ఐమాక్స్‌ పక్కన అంబేద్కర్‌ స్క్వేర్‌‌, ఎన్‌టీఆర్ గార్డెన్స్, సరస్వతి విద్యామందిర్‌, రేస్‌ కోర్స్‌ రోడ్‌ పార్కింగ్‌ ఏరియాలు.