ఈ దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతిస్తారో తెలుసా?

కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలైంది. గడిచిన సంవత్సరం చేదు అనుభవాల్ని మర్చిపోయి కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. సంబరంగా వేడుకలు జరుపుకుంటారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడంలో ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం పాటిస్తారు. కొన్ని దేశాల ఆసక్తికరమైన సంప్రదాయాలను తెలుసుకుందాం. .

కొత్త సంవత్సరం మొదలవుతోంది అంటే కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త లక్ష్యాలు ఏర్పడతాయి. గడచిన చేదు అనుభవాలను మర్చిపోయి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త సంవత్సరానికి వెల్కం చెబుతూ రకరకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో సంప్రదాయాల్ని పాటిస్తారు. అవి వింతగా అనిపించినా అవి వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గుర్తు చేస్తాయి.
  • ALSO READ | మీ ప్రియమైన వారికి కొత్త సంవత్సరం రోజున ఈ గిఫ్ట్స్ ఇచ్చేయండి.. హ్యాపీగా ఫీలవుతారు
  • స్పెయిన్‌లో అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లు తినడం సంప్రదాయమట. ఒక్కో పండు ఒక్కో నెల అదృష్టానికి సంకేతాన్ని సూచిస్తుందని వారు నమ్ముతారు. 

  • జపాన్‌లో ప్రజలు అర్ధరాత్రి వేళ దేవాలయాల వద్ద 108 సార్లు గంటలు మోగిస్తారట. 

  • స్కాట్లాండ్‌లో అయితే అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి మొదటగా ఎవరైతే అడుగు పెడతారో వారు అదృష్టం రూపంలో బహుమతులు తెస్తారట. 

  • బ్రెజిల్‌లో అయితే ప్రజలు తెలుపు రంగులు బట్టలు ధరించి సముద్ర దేవత అయిన యెమాంజకు నైవేద్యంగా సముద్రంలోకి పువ్వులను విసురుతారట.

  • డెన్మార్క్‌లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడంలో వారి సంప్రదాయం మరీ విచిత్రంగా ఉంటుంది. స్నేహం మరియు అదృష్టానికి చిహ్నంగా కుటుంబ సభ్యుల తలుపులపై వంట పాత్రలను విసురుతారట.

  •  గ్రీస్‌లో గ్రీకులు వాసిలోపిటా అనే కేక్‌లో నాణాన్ని పెడతారట. ఎవరి స్లైస్‌లో అయితే నాణం ఉంటుందో వారికి సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. 

  • న్యూ ఇయర్ అంటేనే పాతకి బైబై చెప్పి కొత్తని ఆహ్వానించడం కదా.. సౌతాఫ్రికా ప్రజలు పాత వస్తువుల్ని వదిలించుకోవడానికి కొత్తవాటిని స్వాగతించడానికి కిటికీల నుండి పాత వస్తువులు, ఫర్నీచర్ బయటకు విసిరేస్తారట.

  • ఫిలిప్పీన్ ప్రజలు గుండ్రని ఆకారంలో ఉన్నవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయని విశ్వసిస్తారు. అందువల్ల వారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ గుండ్రని చుక్కలు ఉన్న దుస్తులు ధరిస్తారట. ఆ రోజు గుండ్రని పండ్లను తింటారట. 

  • రష్యాలో అయితే కాగితంపై న్యూ ఇయర్ విషెస్ రాసి దానిని కాల్చి ఆ పొడిని అర్ధరాత్రి షాంపైన్‌లో కలుపుకుని తాగుతారట

  • యునైటెడ్ స్టేట్స్‌లో అయితే న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు టైమ్ బాల్‌ని కిందకు వదులుతారు. దీనిని ‘బాల్ డ్రాప్’ అంటారు. అలా వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది.


ఇలా పలు దేశాల్లో వారి సంప్రదాయాలకి అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. మూఢనమ్మకాలుగా అనిపించినా అవి వారి సంస్కృతి, సంప్రదయాలను ప్రతిబింబిస్తాయి