రెడ్ బుక్ ఓపెన్ చేస్తం .. మీడియా చిట్​​చాట్​లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​

  • బీఆర్ఎస్  హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవు
  • మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే కేబినెట్​ విస్తరణ
  • పీసీసీ కార్యవర్గం ఏర్పాటూ అప్పుడే
  • జీవన్ రెడ్డి ఇష్యూను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించినం
  • విదేశాల నుంచి సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్న బీఆర్ఎస్
  • మూసీ, హైడ్రాపై బీఆర్ఎస్, బీజేపీ బురద జల్లుతున్నయని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వాళ్లపై చర్యలు తీసుకునేందుకు త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పొలిటికల్ బాంబులు ఉంటాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటనపై మహేశ్​గౌడ్​ స్పందిస్తూ.. అలాంటి దానికోసమే తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ‘‘కేసీఆర్ పదేండ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసిండు.

అయినా ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను మేం అమలు చేస్తున్నం.  డబ్బుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, ఆ డబ్బులను దండుకున్న వారే ఇప్పుడు మూసీపై మాట్లాడుతున్నరు” అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాల్సిన స్థలంలో కట్టలేదని అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు  బీఆర్ఎస్  తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు.

డీపీఆర్ కోసం రూ. 140 కోట్లు తప్ప ఒక్క పైసా అదనంగా ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల ఖర్చు అయితే మూసీకి కూడా అదే స్థాయిలో ఖర్చు అయితాయని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ‘‘కేటీఆర్ దుబాయ్, సింగపూర్ నుంచి సోషల్ మీడియాను నడిపిస్తూ..ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నడు. పోలీసులు ఈ సోషల్ మీడియాను నడిపే వారి ఆచూకీని  కనుక్కోలేకపోతున్నరు. ఒకవైపు బీఆర్ఎస్, ఇంకో వైపు బీజేపీ అడ్డగోలుగా మూసీపై అబద్ధాలు ఆడుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాను అనైతికంగా వాడుకొని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నరు” అని మండిపడ్డారు. 

రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే  పీసీసీ కార్యవర్గ ఏర్పాటు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఏఐసీసీ నేతలు బిజీ బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని, కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ అన్నారు. అయినా అది తన పరిధిలో లేని అంశం అని, అది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.   పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కూడా ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాతనే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశాన్ని సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించామన్నారు.

జగిత్యాల అంశం రెండు రోజుల్లో సమసిపోతుందని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రంలో పార్టీ కోసం ఆమె బాగా కష్టపడుతున్నారని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి వెళ్లినా తప్పేనా? పార్టీ ఇన్​చార్జ్​ హైదారాబాద్ లో ఉన్న తప్పేనా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులను మోసం చేసిందే కేసీఆర్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులను అప్పుడు చితకబాదితే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ ఎస్ నాయకులు రైతు పోరుబాట పట్టడం ఏమిటని నిలదీశారు.