తెలంగాణ కిచెన్..పాలతో పకోడి?

ఉదయం నిద్ర లేవగానే వంటింట్లో స్టవ్​ మీదకు పాల గిన్నె ఎక్కనిదే మిగతా వంట పని మొదలు కాదు. కానీ.. పాలతో టీ, కాఫీ.. లేదంటే కొన్ని రకాల స్వీట్లలో తప్ప మరో రకంగా ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడు చేయండి. పాలతో హెల్దీ డ్రింక్స్, స్వీట్స్​తోపాటు.. హాట్​ రెసిపీస్​ కూడా చేసుకోవచ్చు! ఈరోజు (నవంబర్ 26)న మన దేశంలో ‘నేషనల్​ మిల్క్​ డే’ జరుపుతారు. అందుకోసమే ఈ స్పెషల్​ రెసిపీలు ట్రై చేయండి.

షలబ్​

కావాల్సినవి :
 పాలు - రెండు కప్పులు, 
చక్కెర - నాలుగు టేబుల్ స్పూన్లు
కార్న్​ ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్
బాదం, పిస్తా తరుగు, కొబ్బరి పొడి - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ - అర టీస్పూన్

తయారీ : పాన్​లో బాదం, పిస్తా తరుగు, కొబ్బరి పొడి ఒక్కోటి సపరేట్​గా వేసి వేగించాలి. పెద్ద పాన్​లో మరో పాన్​ పెట్టి పాలు పోసి, కార్న్​ ఫ్లోర్ వేసి కలిపి కాసేపు కాగబెట్టాలి. తర్వాత అందులో చక్కెర వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడ్డాక రోజ్ వాటర్​ కలపాలి. నురగ వచ్చే వరకు పాలను గిలక్కొట్టాలి. ఆ పాలను గ్లాస్​లో పోసి, వేగించిన బాదం, పిస్తా తరుగు, కొబ్బరి పొడి చల్లితే హాట్​ హాట్​గా షలబ్ రెడీ. 

మఖండి హల్వా

కావాల్సినవి :

పాలు - మూడున్నర కప్పులు
బొంబాయి రవ్వ, చక్కెర - ఒక్కో కప్పు చొప్పున
నెయ్యి - ముప్పావు కప్పు
ఎండుద్రాక్ష, బాదం, ఎండు కొబ్బరి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక పాన్​లో టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి ఎండుద్రాక్ష, బాదం, ఎండు కొబ్బరి తరుగు వేసి వేగించాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. మరో గిన్నెలో నెయ్యి వేడి చేసి చక్కెర వేసి కరిగించాలి. తర్వాత పాలు పోసి, నానబెట్టిన బొంబాయి రవ్వ వేసి కలపాలి. గరిటెతో తిప్పుతూ ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వేగించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలపాలి. 

హెల్దీ డ్రింక్  

కావాల్సినవి :

పాలు -రెండు కప్పులు
యాలకులు - రెండు
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
మఖానా(తామర గింజలు) - ఒక కప్పు
బాదం, జీడిపప్పు, పిస్తా, కొబ్బరి ముక్కలు, చక్కెర - ఒక్కోటి పావు కప్పు చొప్పున
శొంఠి పొడి - అర టీస్పూన్
కుంకుమ పువ్వు రేకులు - ఐదు
కర్జూరాలు - మూడు

తయారీ :  ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి మఖానా, బాదం, జీడిపప్పు, పిస్తా, కొబ్బరి ముక్కలు వేగించాలి. అవి చల్లారాక, మిక్సీ పట్టాలి. అందులో శొంఠి పొడి, కుంకుమ పువ్వు రేకులు వేసి కలపాలి. ఒక గిన్నెలో పాలు పోసి కాగబెట్టాలి. తర్వాత అందులో తయారుచేసుకున్న మిశ్రమాన్ని నాలుగు టేబుల్ స్పూన్లు వేయాలి. తర్వాత చక్కెర, మఖానా కూడా వేసి కలపాలి. కర్జూరాల ముక్కలు వేసి మరికాసేపు మరిగించాలి. అంతే.. టేస్టీగా ఉండే హెల్దీ మిల్క్​ రెసిపీ రెడీ. 

పాల పకోడి

కావాల్సినవి :
పాలు - రెండు కప్పులు; కార్న్​ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - పావు టీస్పూన్; ఉప్పు, నీళ్లు, నూనె - సరిపడా
నెయ్యి - ఒక టీస్పూన్ ; బ్రెడ్ పొడి - కొంచెం

తయారీ :  ఒక పాన్​లో పాలు పోసి కాగబెట్టాలి. ఒక గిన్నెలో కార్న్​ ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు వేసి కొంచెంకొంచెంగా పాలు పోస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని మరిగే పాలలో వేసి కలపాలి. ఉండలు లేకుండా గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. అందులో నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి. తర్వాత ఒక గిన్నెలో మెత్తటి, పలుచటి బట్ట పరిచి అందులో ఈ మిశ్రమం పోసి పూర్తిగా కప్పేయాలి. ఆ గిన్నెను ఫ్రిజ్​లో రెండు గంటలు ఉంచాలి. బయటకు తీశాక, గట్టి పడిన పాల మిశ్రమాన్ని చాకుతో ముక్కలు చేయాలి. మరో గిన్నెలో కార్న్​ ఫ్లోర్​, నీళ్లు పోసి కలపాలి. అందులో కట్ చేసిన ముక్కల్ని ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. వాటిని వేడి వేడి నూనెలో వేసి వేగిస్తే పాల పకోడి రెడీ. 

వైట్​ డెజర్ట్ 

కావాల్సినవి :

పాలు - ఒక లీటర్
చక్కెర, మైదా, విప్పింగ్ క్రీమ్​ - ఒక్కో కప్పు చొప్పున
వెన్న - పావు కప్పు
వెనీలా షుగర్ - ఏడు గ్రాములు
కొబ్బరి పొడి - ఒకటిన్నర కప్పు
వాల్​నట్స్ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ :  ఒక గిన్నెలో పాలు పోసి, చక్కెర, మైదా వేసి బాగా కలపాలి. తర్వాత గిన్నెను స్టౌ మీద పెట్టి, తక్కువ మంట మీద ఆ మిశ్రమాన్ని కాగబెట్టాలి. ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతుండాలి. మిశ్రమం దగ్గర పడ్డాక అందులో వెనీలా షుగర్, వెన్న వేసి కలపాలి. ఒక ట్రేలో కొబ్బరి పొడి చల్లి, అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి నాలుగ్గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. ఒక గిన్నెలో విప్పింగ్ క్రీమ్​, రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి విస్కర్​తో బాగా కలపాలి. ఫ్రిజ్​లో పెట్టిన ట్రే బయటకు తీసి, దాని పైన ఈ క్రీమ్​ పూయాలి. తర్వాత చాకుతో పొడవాటి ముక్కలు కోయాలి. వాటిపై వాల్​నట్స్ తరుగు చల్లాలి. తర్వాత వాటిని రోల్స్​లా చుట్టాలి. కావాలంటే కొబ్బరి పొడి కొంచెం చల్లుకోవచ్చు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉండే ఈ సాఫ్ట్​ స్వీట్​ చాలా టేస్టీగా ఉంటుంది. 


క్యారెట్ మిల్క్

కావాల్సినవి : 

పాలు - ఒక కప్పు
క్యారెట్ - నాలుగు
అంజీరా, కర్జూర (నానబెట్టి) -
ఒక్కోటి రెండేసి చొప్పున
కుంకుమ పువ్వు - కొంచెం

తయారీ :  క్యారెట్ల తొక్క తీసి, ముక్కలు తరగాలి.  ప్రెజర్ కుక్కర్​లో నీళ్లు పోసి, క్యారెట్​ ముక్కల తరుగు వేసి మూతపెట్టి ఉడికించాలి. తర్వాత వాటిని మిక్సీ జార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో పాలు పోసి, క్యారెట్ గుజ్జు రెండు టీ స్పూన్లు వేసి కలపాలి. నానబెట్టిన అంజీరా, కర్జూరలను చిన్న ముక్కలుగా తరిగి పాల మిశ్రమంలో వేయాలి. పైనుంచి  కుంకుమ పువ్వు చల్లి... వేడి వేడిగా తాగితే బాగుంటుంది.